చీల్చారు, చిత్తు చేసారు: మోదీ-షా మార్క్ గేమ్ లో జుజీబీలు..!!
బీజేపీ రాజకీయం ఏంటో మహారాష్ట్రలో చూపించింది. తాము అనుకున్నది సాధించటం కోసం బీజేపీ రాజకీయంలో మరాఠా రాజకీయ యోధులకు భారీ జలక్ తగిలింది. శివసేన, ఎన్సీపీ మూలాల పై దెబ్బ కొట్టింది. మహారాష్ట్రలో గెలిచి తమతో విభేదించి కాంగ్రెస్ తో జత కట్టిన శివసేనకు షాక్ ఇవ్వాలనే బీజేపీ ప్లాన్ సక్సెస్ అయింది. శివసేన, ఎన్సీపీ నుంచి చీలక వర్గాలుగా ఏర్పడి..బీజేపీ తో జత కట్టిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు థాక్రే- శరద్ పవార్ పార్టీలకంటే ఎక్కువ సీట్లు సాధించాయి. దీంతో, బీజేపీ మార్క్ రాజకీయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ మహారాష్ట్ర
మహారాష్ట్రలో తొలి నుంచి బీజేపీ - శివసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసాయి. సీఎం పదవి పైన పేచీ వచ్చింది. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల తో ఉధ్దవ్ థాక్రే కాంగ్రెస్ - ఎన్సీపీతో కలిసారు. కొంత కాలం వేచి చూసిన బీజేపీ తన దైన శైలిలో రాజకీయం చేసింది. శివసేన నుంచి షిండే బయటకు వచ్చి బీజేపీతో కలిసారు. ఫలితంగా షిండే సీఎం అయ్యారు. అటు ఎన్సీపీ నుంచి శరద్ పవార్ ను కాదని అజిత్ పవార్ బీజేపీతో జత కట్టారు. దీంతో, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు రెండు కూటముల్లోనూ ఏర్పడ్డాయి. అదే బీజేపీ ఈ ఎన్నికల్లో ఆయుధంగా మలచుకుంది.

వ్యూహాత్మక ఎత్తుగడలతో
పక్కా వ్యూహాత్మకంగా శివసేన - ఎన్సీపీ బలం ఉన్న ప్రాంతాల్లో తమతో కలిసి షిండే సేన - అజిత్ పవర్ ఎన్సీపీ అభ్యర్ధులను రంగంలోకి దించింది. మోదీ సుడిగాలి ప్రచారం చేసారు. ఉద్ధవ్ - శరద్ పవార్ ను ఆ రెండు పార్టీల నుంచి వచ్చిన వారితోనే గురి పెట్టించి..ఈ ఎన్నికల్లో మట్టి కరిపించింది. థాక్రే - శరద్ పవార్ తో కలిసిన కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 120 కి పైగా సీట్లను గెలిచే అవకాశం కనిపిస్తోంది. అసలైన పార్టీల కంటే చీలిన పార్టీలే మహాయుతిగా ఎక్కువ సీట్లు సాధించాయి. ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 38 సీట్లు సాధించగా.. శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 14 సీట్లలో విజయం సాధించింది.
అనూహ్య ఫలితాలు
అదే విధంగా థాక్రే శివసేన 18 సీట్లకు పరిమితం కాగా, షిండే శివసేన 56 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక..అధికారం దక్కించుకోవాలంటే 145 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ సింగిల్ గా 125 సీట్లు దక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ 17 సీట్లకే పరిమతం అయింది. మహాయుతి 225 సీట్లలో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఓట్ల శాతంలోనూ మహాయుతి అనూహ్యంగా బీజేపీ 25.08, శివసేన (షిండే) 12.68, ఎన్సీపీ (అజిత్) వర్గం 1.95 శాతం చొప్పున ఓట్లు సాధించాయి. దీంతో, బీజేపీ ఆపరేషన్ మహారాష్ట్ర అనుకున్న విధంగా పూర్తి చేసి తమ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో మోదీ - షా మరోసారి నిరూపించారు.












Click it and Unblock the Notifications