కొత్త టీం సిద్దం, భారీ ప్రక్షాళన- పురందేశ్వరికి కొత్త బాధ్యతలు, బండి సంజయ్ కు ఇక..!!
ఢిల్లీ కేంద్రంగా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. జెన్ జీ నిరసనల తరువాత కొత్త ప్రణాళిక లతో ముందుకు వెళ్లేందుకు కేంద్ర నాయకత్వం సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా పార్టీ - ప్రభుత్వంలో సమూల మార్పులకు రంగం సిద్దం చేసారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు కొత్త టీం ను ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసేందుకు తుది కసరత్తు కొనసాగుతోంది.
మోదీ 4.0 లక్ష్యంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్టీ కొత్త చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ టీం సిద్దం అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ మేరకు బీజేపీ కార్యవర్గం ప్రకటనకు సిద్దమైనా..సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఆలస్యం అయింది. ఈ కొత్త టీం ఈ రోజు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కొందరు కేంద్ర మంత్రులకు కూడా ఇందులో చోటు కల్పించనున్నట్లు తెలిసింది.

ధర్మేంద్ర ప్రధాన్ కు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా(ఫిబ్రవరి-మార్చి), గుజరాత్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్(నవంబరు-డిసెంబరు) రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నూతన కార్యవర్గాన్ని రూపొందించారు. త్వరలోనే ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేపడతారని బీజేపీ వర్గాల సమాచారం. పార్టీకి నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాతీయ అధికార ప్రతినిధులు, అనుబంధ మోర్చాల అధిపతులను ప్రకటించనున్నారు.
తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత
కొందరు మంత్రులకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే విధంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, జాతీయ కౌన్సిల్ లోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కీలక పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించటం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో బండి సంజయ్ -కిషన్ రెడ్డిలను మంత్రులుగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఏపీ నుంచి పురందేశ్వరికి కొత్త జాతీయ కార్య వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. కర్ణాటక నుంచి విజయేంద్ర, తమిళ నాడు నుంచి మురుగన్, కేరళ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ లకు జాతీయ టీంలో కొత్త బాధ్యతలు అప్పగించటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సారి జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత పెరగనుంది.












Click it and Unblock the Notifications