Delhi Assembly Election 2025: కేజ్రీవాల్ 'సీక్రెట్ బిల్డింగ్' బయట పెట్టిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో అక్కడ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండగా.. ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ, కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నాయి. దీంతో దిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
కేజ్రీవాల్ 'షీష్ మహల్'..
దిల్లీలో ఎలాగైనా ఆప్ సర్కార్ ను గద్దె దింపాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ కు సంబంధించిన షీష్ మహల్ ను బయటపెట్టింది. షీష్ మహల్ లో ఉన్న వస్తువులు, సామాగ్రిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేజ్రీవాల్ అధకారిక నివాసం షీష్ మహల్ ను ఎప్పుడైనా చూశారా..? కోట్ల సంపద ఈ భవనంలో ఉంది. ప్రజల పన్నుతో ఈ భవనాన్ని నిర్మించారు. అని ఎక్స్ వేదికగా బీజేపీ పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఈ నివాసంలోనే ఉండేవారు.

భవనంలో ఏమేమి ఉన్నాయి..
లగ్జరీ బెడ్రూంలు, మోడ్రన్ కిచెన్, 88 ఇంచుల ఎల్ఈడీ టీవీలు, మసాజ్ చెయిర్స్, మోడ్రన్ సోఫాలు, రిమోట్ కర్టెన్లు, ఫ్రెంచ్ రిఫ్రిజెరేటర్.. తదితర సామాగ్రి భవనంలో ఉన్నట్లు బీజేపీ పేర్కొంది. కేజ్రీవాల్ అతిపెద్ద దొంగ అని ఆరోపణలు చేసింది.
దేశ రాజధానిని లూటీ చేశారు..
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకుర్ ఆప్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షీష్ మహల్ కోసం కేజ్రీవాల్ వందలకోట్ల ప్రజల డబ్బును ఖర్చు చేశారని మండిపడ్డారు. ఆప్ సర్కార్ దిల్లీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. దిల్లీలో ఆప్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ 15 మంది ఆప్ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లారని.. వారిలో ఒక ఎంపీ కూడా ఉన్నారని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా జైళ్లో గడిపారని అనురాగ్ ఠాకుర్ అన్నారు.
ఇక దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. దేశ రాజధానిలో ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అయితే.. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు 21 వేల ఆర్థిక సాయం, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. ఇక దిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications