హైఓల్టేజ్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో సాధించింది. విజయం వైపు దూసుకుపోతోంది. అందరి దృష్టినీ ఆకర్షించిన నందిగ్రామ్ తో పాటు రెజినగర్ నియోజకవర్గల్లో బీజేపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తోన్నారు. గెలుపునకు మరింత చేరువ అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఏ మాత్రం కూడా ప్రభావం చూపట్లేదీ రెండుచోట్లా.
ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం.. రెజినగర్. ఇక్కడ బీజేపీకి పట్టం కడుతున్నారు ఓటర్లు. ఆ పార్టీ అభ్యర్థి శంఖరావ్ సర్కార్ భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచారు. ముస్లిం ఓటుబ్యాంక్ ఉన్న ఈ నియోజకవర్గంలో సాధిస్తోన్న ఆధిక్యం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటోన్నారు.

మూడో రౌండ్ ముగిసేసరికి రెజినగర్ లో బీజేపీకి 28,416 ఓట్లు పోల్ అయ్యాయి. తన సమీప ప్రత్యర్థి, ఆమ్ జనతా ఉన్నయిన్ పార్టీ అభ్యర్థి గులామ్ నబీ ఆజాద్ పై 20,307 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అబ్దుల్లాహి కఫీకి పడ్డ ఓట్లు 1,708 మాత్రమే. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీకి మెజారిటీ 50,000ను దాటుతుందని పార్టీ నాయకులు ఆశిస్తోన్నారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న నందిగ్రామ్ లోనూ బీజేపీ ఘన విజయం దిశగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణి రథ్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడకే. మూడో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన మిలన్ ప్రధాన్ పై 24, 820 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయలేదు గానీ.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. అయినా బీజేపీ ముందు ఈ రెండు పార్టీలు కూడా చెల్లాచెదురయ్యాయి.
ముఖ్యమంత్రి సువేందు అధికారి సొంత నియోజకవర్గం ఇది. మే నాటి ఎన్నికల్లో భవానీపూర్, నందిగ్రామ్ నుంచి గెలిచారాయన. ఆ తర్వాత నందిగ్రామ్ కు రాజీనామా చేశారు. అలాగే.. ఏజేయూపీ అధినేత హుమాయూన్ కబీర్ రెజినగర్ స్థానాన్ని వదులుకుని నౌడాను ఎంచుకోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు గులామ్ నబీ ఆజాద్ ఏజేయూపీ తరఫున పోటీ పడుతున్నప్పటికీ, బీజేపీ ప్రభంజనానికి నిల్చోలేకపోతున్నారు.













Click it and Unblock the Notifications
