యూపిఏకు అవిశ్వాసం గండం: టిపై తప్ప బిజెపి సిద్ధం
న్యూఢిల్లీ: కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వానికి అవిశ్వాసం గండం పొంచి ఉంది. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంశం మినహా ఇతర ఏ అంశం పైన అయినా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది.
సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దీనిపై బిజెపి పార్లమెంటరీ బోర్డులో చర్చ జరిగింది. బిజెపి తెలంగాణకు మొదటి నుండి అనుకూలంగా ఉందని, కాబట్టి ఆ అంశంపై అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతివ్వవద్దని నిర్ణయించుకుంది.

ఇక ఇతర ఏ అంశాల పైన అయినా అవిశ్వాస తీర్మానం వస్తే మాత్రం మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. అయితే, అవిశ్వాసం పైన చర్చ జరిగినప్పుడు ఎంతమంది మద్దతు ఇస్తారో చూసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు 2జి కేసులో జెపిసి నివేదికపై స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి బిజెపి నిర్ణయించింది.
లోకసభలో సమైక్య నినాదాలు
పార్లమెంటు ఉభయ సభలో మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్య నినాదాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు గేటు వద్ద అంతకుముందు నిరసన తెలిపారు. ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications