మహారాష్ట్రలో బీజేపీకే అధికారం, సీఎంగా ఉద్ధవ్ బెస్ట్
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమికే అధికారం దక్కనుందని సర్వేలో వెల్లడవుతోంది. అదే సమయంలో ఎక్కువ మంది ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. 288 స్థానాలకు గాను బీజేపీ కూటమి 154 స్థానాలు దక్కించుకుంటుందని, 47 సీట్లతో శివసేన రెండో స్థానంలో ఉంటుందని ది వీక్, హన్సా రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ శివసేనతో బంధం తెంచుకొని, చిన్న పార్టీలతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
అయితే శివసేనతో పొత్తు లేకపోయినప్పటికీ మహారాష్ట్ర విధానసభలో బీజేపీ, దాని మిత్రపక్షాలు స్పష్టమైన ఆధిక్యత సంపాదిస్తాయని ఈ సర్వే వెల్లడించింది. ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేనే అగ్ర భాగాన నిలిచారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఉద్ధవ్ థాకరేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు.

ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ చవాన్‌కు రెండో స్థానం లభించింది. అయితే ఆయన పార్టీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో కేవలం 25 సీట్లు మాత్రమే లభిస్తాయని ఈ సర్వే తేల్చింది. ఓట్ల శాతంలో బీజేపీ తన ప్రత్యర్థులు అందరికన్నా ఎంతో ముందంజలో ఉందని సర్వే పేర్కొంది. బీజేపీకి 36.5 శాతం ఓట్లు లభిస్తాయని, 17.1 శాతం ఓట్లతో శివసేన రెండో స్థానంలో నిలుస్తుందని, 11.97 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ తృతీయ స్థానానికి దిగజారుతుందని సర్వే తెలిపింది.
ఇటీవలి వరకు కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతింటుందని ఈ సర్వేలో తేలింది. ఎన్సీపీ 5.85 శాతం ఓట్లతో కేవలం 17 సీట్లను మాత్రమే దక్కించుకుంటుందని పేర్కొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో శరద్ పవార్‌ను చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడలేదు. ఉద్ధవ్, పృథ్వీరాజ్, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ థాకరే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నావిస్ తర్వాత అయిదో స్థానంలో పవార్ ఉన్నారు.
శివసేన 47 స్థానాల్లో గెలిచి బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తేల్చింది. రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్ 5.11 శాతం ఓట్లతో పది సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఇతర పార్టీలు 6.79 శాతం ఓట్లతో 15 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది. 20 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని, వారు 4.71 శాతం ఓట్లు సాధిస్తారని సర్వే వివరించింది.












Click it and Unblock the Notifications