160 ఓట్లతో గెలిచి.. రీకౌంటింగ్‌లో 16 ఓట్లతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థిని: అర్ధరాత్రి హైడ్రామా
బెంగళూరు: బెంగళూరులోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి 16 ఓట్ల తేడాతో గెలవడం దీనికి కారణమైంది. తమ అభ్యర్థి ఓడిపోయినట్లు తెలియడంతో కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ హుటాహుటిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవడం, ఆయనకు పోటీగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH | BJP’s CK Ramamurthy defeated Congress' Sowmya Reddy by a narrow margin of 16 votes in the Jayanagar constituency; Congress workers held a protest as they alleged misuse of government machinery to favour Ramamurthy.#KarnatakaElectionResults2023 pic.twitter.com/I08HAzYJu3
— ANI (@ANI) May 14, 2023
ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సౌమ్యా రెడ్డి విజయం సాధించినట్లు తొలుత ఎన్నికల అధికారులు ప్రకటించారు. 160 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సీకే రామ్మూర్తిని ఓడించారు. తొలి రౌండ్ నుంచీ వెనుకంజలో ఉంటూ వచ్చిన సౌమ్యారెడ్డి చివరికి 160 ఓట్ల తేడాతో ఒడ్డెక్కారు. నామమాత్రపు మెజారిటీ కావడం వల్ల బీజేపీ అభ్యర్థి రామ్మూర్తి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు.

ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సౌమ్యా రెడ్డి హుటాహుటిన ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. గెలిచిన నేపథ్యంలో- అప్పటికే విజయోత్సవాలను జరుపుకొంటోన్న సౌమ్యారెడ్డి, ఆమె అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పరుగులు పెట్టారు. సీకే రామ్మూర్తి విజ్ఞప్తి మేరకు ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు.
జయనగర ఓట్ల లెక్కింపు కేంద్రంలో అర్ధరాత్రి దాటిన తరువాత రీకౌంటింగ్ ప్రారంభమైంది. మూడు రౌండ్ల మేర రీకౌంటింగ్ చేసిన తరువాత ఫలితం తారుమారయింది. ఇక్కడ సీకే రామ్మూర్తి విజయం సాధించారు. సౌమ్యా రెడ్డిపై 16 ఓట్ల తేడాతో నెగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలుత 160 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన ఆమె రీకౌంటింగ్‌లో 16 ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.

రీకౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి సీకే రామ్మూర్తికి 57,797, కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డికి 57,781 ఓట్లు పోల్ అయ్యాయి. 16 ఓట్ల తేడాతో సీకే రామ్మూర్తి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనితో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హల్‌చల్ చేశారు. మరోసారి రీకౌంటింగ్ కోసం పట్టుబట్టారు. దీనికి ఎన్నికల అధికారులు అంగీకరించలేదు. దీనితో వారంతా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సౌమ్యా రెడ్డి ఓడిపోయినట్లు తెలిసిన వెంటనే బెంగళూరు రూరల్‌కు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు డీకే సురేష్ హుటాహుటిన జయనగరకు చేరుకున్నారు. ఎన్నికల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అదే సమయంలో బీజేపీకి చెందిన బెంగళూరు సౌత్ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య కూడా జయనగరకు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై తాము హైకోర్టులో సవాల్ చేస్తామని డీకే సురేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications