ఆరెస్సెస్ ఎలుకలు- కాదు సింహాలు-జార్ఖండ్ లో మాటల యుద్ధం..!
త్వరలో ఎన్నికలకు సిద్దమవుతున్న గిరిజన రాష్ట్రం జార్ఖండ్ లో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా తనను గనుల అక్రమాల కేసులో జైలుకు పంపిన బీజేపీపై సీఎం హేమంత్ సోరెన్ రగిలిపోతున్నారు. తాజాగా జైలు నుంచి బయటికి వచ్చి తిరిగి సీఎం పదవి చేపట్టిన హేమంత్ సోరెన్ బీజేపీతో పాటు ఆ పార్టీ సైద్ధాంతిక సంస్ధ ఆరెస్సెస్ పై తాజాగా ఘాటు విమర్శలు చేశారు. దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందించింది.
ఆరెస్సెస్ నేతల్ని ఎలుకలుగా పేర్కొంటూ తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విమర్శలు చేశారు. ఓట్ల కోసం బీజేపీతో కలిసి ఆరెస్సెస్ రాష్ట్రంలో మత విద్వేషాలు రగుల్చేందుకు కుట్రలు పన్నుతోందని సోరెన్ ఆరోపించారు. ఓట్ల కోసం రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చు రేపుతోందని తెలిపారు. జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా ఉన్న అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేస్తున్న వ్యాఖ్యలపై సోరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై బీజేపీ ఇవాళ ఘాటుగా స్పందించింది. సోరెన్ వ్యాఖ్యలు దేశంలో తిరిగి సనాతన ధర్మాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న హిందూ సింహాలకు అవమానం అంటూ ఆరెస్సెస్ ను వెనకేసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా సోరెన్ ను అమెరికాలో ఉంటూ భారత ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేస్తున్న బిలియనీర్ జార్జ్ సోరోస్ తో పోల్చింది. 1855 నాటి సంతాల్ తిరుగుబాటును కూడా ప్రస్తావిస్తూ సోరెన్ ను టార్గెట్ చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications