చంద్రబాబు సహా 21 ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన బెంచ్
Recommended Video
న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలుగుదేశం సహా దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. చంద్రబాబు సహా పలువురు నాయకులు సంతకాలు చేసి, దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను తిరస్కరించింది. రివ్యూ పిటీషన్‌పై విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని తిరస్కరించింది. రివ్యూ పిటీషన్‌ను కొట్టి పడేసింది. సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా తిలకించడానికి మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నాయకులు స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. వారి సమక్షంలో- రివ్యూ పిటీషన్‌ను కొట్టేసింది ధర్మాసనం.
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పునః విచారణ చేపట్టింది. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం దీనిపై వాదోపవాదాలను ఆలకించనుంది. ఈ వాదోపవాదాలను ప్రత్యక్షంగా తిలకించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి ఎ రాజా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. వారి వెంట- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు ఉన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం ద్వారా భారతీయ జనతాపార్టీ అన్ని ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తోందని తెలుగుదేశం సహా దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఓటు వేసిన అనంతరం ఈవీఎంల నుంచి వెలువడే వీవీప్యాట్ స్లిప్పుల్లో కనీసం 50 శాతం మేర లెక్కించాలని, అప్పుడే పారదర్శకత ఉంటుందని వారు డిమాండ్ చేశారు. ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఇదివరకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అప్పట్లో సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం- ప్రతి నియోజకవర్గంలో కనీసం అయిదు ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయిదు ఈవీఎంలకు చెందిన స్లిప్పులను లెక్కించడం వల్ల ఉపయోగం ఉండదని, కనీసం 50 శాతం లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వాదోపవాదాలను చేపట్టింది. దీన్ని పర్యవేక్షించడానికి చంద్రబాబు సహా ఫరూఖ్ అబ్దుల్లా, రాజా తదితర నాయకులు సుప్రీంకోర్టుకు స్వయంగా వెళ్లారు. అక్కడ వారికి సుప్రీంకోర్టు కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications