ముంబై స్వీపర్.. ఎంఫిల్ లో టాప్ లేపాడు..
ముంబై : చదువును కేవలం ఉద్యోగం కోసమే అన్నట్టుగా భావించేవాళ్లు కొందరైతే.. విద్య వల్ల వచ్చిన జ్ఞానాన్ని పదిమందికి ఉపయోగపడే రీతిలో మలుచుకోవాలనేది ఇంకొందరి భావన. అందుకే.. స్వీపర్ గా పనిచేస్తూనే ఎంఫిల్ పూర్తి చేసిన యాదవ్.. తన చదువును సొంత ప్రయోజనాల కోసం కాకుండా తనలాగే స్వీపర్లుగా సమాజంలో చిన్న చూపుకు గురవుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగర కార్పోరేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్న 36 ఏళ్ల సునీల్ యాదవ్ ప్రతిష్టాత్మకమైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఎంఫిల్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు, టాటా ఇనిస్టిట్యూట్ నుంచి ఎంఫిల్ పూర్తి చేసినవాళ్లలో ఏడవ ర్యాంకుతో యాదవ్ టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నారు. ఎంఫిల్ కోసం యాదవ్ ఎంచుకున్న అంశం కూడా అతని నేపథ్యానికి సంబంధించిందే కావడం విశేషం.

ప్రపంచీకరణ కార్మికుడు అన్న అంశంపై యాదవ్ ఎంఫిల్ పూర్తి చేశారు. అయితే యాదవ్ ఎంఫిల్ తోనే ఆగిపోదలుచుకోలేదు. సమాజంలో స్వీపర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రస్తుత సమాజం వాళ్లను ఏవిధంగా చూస్తోందన్న అంశంపై యాదవ్ పీ.హెచ్.డీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తను సాధించిన ఎంఫిల్ తో ఏ కార్పోరేట్ సంస్థలోనో ఉద్యోగం చేయాలన్న ఆలోచన తనకు లేదని, రిటైర్ మెంట్ వరకు స్వీపర్ ఉద్యోగంలోనే కొనుసాగుతానని స్పష్టం చేశాడు.
యాదవ్ తండ్రి ముంబై కార్పోరేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్న సమయంలో అనారోగ్య కారణాలతో మరణించాడు. దీంతో తండ్రి ఉద్యోగాన్ని కొడుకు యాదవ్ కు ఇచ్చారు కార్పోరేషన్ అధికారులు. సమాజంలో స్వీపర్ వృత్తి పట్ల ఎంత ఏహ్య బావంతో తనకు స్వీయ అనుభవంతో తెలిసొచ్చిందన్న యాదవ్.. అందుకే చదువుపై దృష్టి పెట్టానని మీడియాతో తెలిపాడు. ఇంటర్ పూర్తయ్యాక బీకాం, బీఎ జర్నలిజం, సోషల్ వర్క్ లో పీజీ చేశానని తెలిపాడు. సమాజంలో చిన్న చూపుకు గురవుతున్న స్వీపర్ల కోసం ఏదైనా చేయడానికే తన చదువును అంకితం చేస్తానని చెప్పాడు.












Click it and Unblock the Notifications