మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచికగా లోక్ సభ, రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాకర్షక విధానాలను అనుసరించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

ప్రతిపక్షాలు సిద్ధం..
ఎన్నికల ఏడాదిలో ప్రవేశించినందువల్ల అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, జీఎస్టీ, పెట్రోల్-డీజిల్ రేట్లు.. ఇవన్నీ ఉభయసభల్లో ప్రస్తావనకు తీసుకుని రానున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును ప్రదర్శిస్తోండటం, నానాటికీ పడిపోతూ వస్తోన్న రూపాయి విలువ, ఇతర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.

సమరశంఖం..
ఈ క్రమంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే రెండు ప్రతిపక్ష పార్టీలు తమ సమర శంఖాన్ని కూడా పూరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ- పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతి ప్రసంగం వేళ.. తమ నిరసనను తెలియజేస్తూ సభలను బాయ్ కాట్ చేస్తామని వెల్లడించాయి. తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశాయి.

మున్ముందు పార్లమెంట్ సమావేశాల్లో
రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తామంటూ ప్రకటించడం ద్వారా- మున్ముందు పార్లమెంట్ సమావేశాల్లో ఈ రెండు పార్టీలు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తామనే విషయాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పకనే చెప్పినట్టయింది. మెజారిటీ బిల్లులను వ్యతిరేకించడంతో పాటు కీలక అంశాల మీద ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే బాధ్యతలను ఈ రెండు పార్టీలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

అన్ని రంగాల్లో వైఫల్యం..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, దీనికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తామని బీఆర్‌ఎస్ నేత, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే కేశవ రావు తెలిపారు. తమతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు చెప్పారు. ఎన్డీఏ పాలనలో అన్ని రంగాలు కుప్పకూలిపోయాయని, ఆర్థిక ప్రగతి మందగించిందని, నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని కేశవరావు అన్నారు. వీటికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తామని అన్నారు.

గౌరవం ఉన్నప్పటికీ..
ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సంజయ్ సింగ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తమ గౌరవం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకించాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, అనేక హామీలను నెరవేర్చట్లేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో పతనమైందో తెలియజేయడానికి రూపాయి విలువే ఓ నిదర్శనమని సంజయ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications