Budget 2026: బడ్జెట్ ఎఫెక్ట్: ఏవి చౌక? ఏవి ప్రియం?
Budget 2026: దేశ ఆర్థిక పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ సామాన్యులకు కొన్ని తీపికబుర్లు, మరికొన్ని చేదు నిజాలను మోసుకొచ్చింది. దిగుమతి సుంకం సవరణల వల్ల మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ మందులు వంటివి చౌకగా మారగా.. మద్యం వంటి విలాసవంతమైన వస్తువుల ధరలు పెరిగాయి.
ధరలు తగ్గేవి ఇవే..
ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఆరోగ్యం, విదేశీ విద్య, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
క్యాన్సర్ మందులు: ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యాన్సర్ వైద్యం మరింత అందుబాటులోకి రానుంది.
విదేశీ ప్రయాణాలు, విద్య: విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న టీసీఎస్‌ను 5-20 శాతం నుండి 2 శాతానికి తగ్గించారు. అలాగే విదేశీ విద్య కోసం చేసే ఖర్చులపై కూడా పన్ను భారం తగ్గింది.

ఎలక్ట్రానిక్ వస్తువులు: మొబైల్ ఫోన్లు, టీవీ పరికరాలు , కెమెరాలు, మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో వాడే విడిభాగాలపై సుంకాలు తగ్గించడంతో వీటి ధరలు దిగిరానున్నాయి.
లెదర్, పాదరక్షలు: తోలు వస్తువులు, బూట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల లెదర్ బ్యాగులు, చెప్పులు, బూట్ల ధరలు తగ్గనున్నాయి.
మరికొన్ని: సోలార్ ప్యానెల్స్ తయారీ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీలు, బయో ఫ్యూయల్ మిక్స్డ్ సీఎన్జీ, విమాన విడిభాగాలు చౌకగా మారనున్నాయి.
ధరలు పెరిగేవి ఇవే..!
మేకిన్ ఇండియాను పెంచడానికి, పర్యావరణ హితం కాని వస్తువులను నియంత్రించడానికి కొన్ని వస్తువులపై పన్నులను పెంచారు.
మద్యం: ప్రభుత్వం సవరించిన పన్నుల విధానం వల్ల విదేశీ మద్యం, ఇతర లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
బొగ్గు: బొగ్గుపై పన్నులు పెరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరిగి, పరోక్షంగా కరెంటు బిల్లులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సిగరెట్లు, పొగాకు: ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పొగాకు ఉత్పత్తులపై 'నేషనల్ కాలిమిటీ కాంటింజెంట్ డ్యూటీ' (NCCD) పెంచడంతో సిగరెట్ల ధరలు ప్రియం కానున్నాయి.
స్క్రాప్: పారిశ్రామిక రంగంలో వాడే కొన్ని రకాల స్క్రాప్ వస్తువుల ధరలు పెరగనున్నాయి.












Click it and Unblock the Notifications