రాహుల్! ముందు నీ పార్టీని చక్కబెట్టుకో: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలకు మాయావతి స్ట్రాంగ్ కౌంటర్
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ), దళిత నేత మాయావతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేసే విషయంపై మాయావతికి సీఎం సీటు ఆఫర్ చేశామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మాయావతిని తమ ఉమ్మడి పార్టీల తరపున సీఎం అభ్యర్థిగా నిలబడాలంటూ ప్రతిపాదన పంపామని, అయితే, ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ అన్నారు.
ఈ నేపథ్యంలో మాయావతి.. రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం అభ్యర్థిత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ గాంధీ స్వయంగా కులతత్వ మనస్తత్వంత బాధపడుతూ తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు చెబుతున్నాడని, తనకు ఎలాంటి ఆఫర్ రాలేదన్నారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలవలేదన్నారు.

సీబీఐ, ఈడీ, పెగాసస్‌లకు భయపడుతున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ కూడా బీఎస్పీ పరువును మసకబార్చే ప్రయత్నం చేశారని మాయవతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే మాట చెబుతోందననారు. తాను ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నానని అంటున్నారని మండిపడ్డారు. తాను ఈ కేసులన్నింటిపై సుప్రీంకోర్టులో పోరాడి గెలిచామని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు మాయావతి. కాంగ్రెస్ ఎప్పుడూ బీఎస్పీని కించపర్చేందుకు, బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందని మాయావతి ఆరోపించారు.
అంతేగాక, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ తన సొంత పార్టీని గాడిలో పెట్టుకోలేకపోతున్నారని మాయావతి ఎద్దేవా చేశారు. నీ పార్టీని నువ్వు సరిదిద్దుకో ముందు అంటూ మాయావతి కౌంటర్ ఇచ్చారు. కాగా, ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు అంతగా ప్రభావాన్ని చూపని విషయం తెలిసిందే. కేవలం సింగిల్ డిజిట్‌కే ఈ రెండు పార్టీలు పరిమితమయ్యాయి. 13 శాతం ఓటు షేర్‌తో బీఎస్పీ ఒక సీటును దక్కించుకుంది.












Click it and Unblock the Notifications