కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంలో ముగ్గురి అరెస్ట్- వారి పేర్లు ఇవే..
హైదరాబాద్: దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 293 మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ కొన్ని మృతదేహాలు బాలాసోర్‌లో ఉన్నాయి. ఆ మృతదేహాలు తమ వారివేనంటూ పలువురు రావడం వల్ల వాటిని అప్పగించే ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటోంది.
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలపై పడిన కోరమాండల్ రైలు బోగీలను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు అధికారులను అరెస్ట్ చేసింది సీబీఐ. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మొహంత, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్ అరెస్ట్ అయ్యారు.
ఈ ముగ్గురిని కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 304, 201 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. కోరమాండల్ ప్రమాద ఘటనలో అరెస్టులు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. తాజాగా అరుణ్ కుమార్ మొహంత, మహ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌ను అరెస్ట్ చేశారు.

తప్పుడు సిగ్నలింగ్ ఇవ్వడం వల్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైందంటూ ఇదివరకే రైల్వే బోర్డ్ నిర్వహించిన ఉన్నత స్థాయి విచారణలో తేలిన విషయం తెలిసిందే. తప్పుడు సిగ్నలింగ్ ఇవ్వడంతో ఈ ముగ్గురి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలింది. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగంలో అనే లోపాలు ఉన్నట్లు రైల్వే బోర్డు గుర్తించింది. ఇది నివారించదగ్గ ప్రమాదమేనని అభిప్రాయపడింది.
రైల్వే సేఫ్టీ కమిషన్ రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలోనూ ఇదే తేలింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ, రెండు సమాంతర ట్రాక్‌లను రిపీటెడ్ అన్ యూజువల్ బిహేవియర్ ద్వారా రైళ్లను ముందుకు సాగేలా ఎస్ అండ్ టీ సిబ్బంది సిగ్నలింగ్ ఇచ్చినట్లు గుర్తించింది. ఎస్ అండ్ టీ సిబ్బంది ద్వారా నివారణ చర్యలు తీసుకుని ఉండొచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications