ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ కేసు నమోదు: ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘనలే కారణం
న్యూఢిల్లీ: నిధుల చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సాంఘిక సంక్షేమ సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా(Oxfam India)పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కేసు నమోదు చేసింది. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని(FCRA) ఉల్లంఘించారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం సిఫార్సు చేసిన పక్షం రోజుల తర్వాత ఈ చర్య చోటు చేసుకుంది.
విదేశీ విరాళాలను వివిధ సంస్థలకు బదిలీ చేయడం ద్వారా ఆక్స్‌ఫామ్ ఇండియా విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ చట్టం, 2020ని ఉల్లంఘించిందని సీబీఐ ఆరోపించింది. సెప్టెంబర్ 29, 2020 నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం అటువంటి బదిలీలను నిషేధిస్తోంది. అయినప్పటికీ, ఆక్స్‌ఫామ్ ఇండియా.. ఎఫ్‌సీఆర్ఏ, 2010 ద్వారా నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతర ఎన్జీవోలకు నిధులను బదిలీ చేసింది.

'సీబీడీటీ ద్వారా ఐటీ సర్వే సమయంలో కనుగొనబడిన ఇమెయిల్ నుంచి.. ఆక్స్‌ఫామ్ ఇండియా తన సహచరులు/ఉద్యోగుల ద్వారా సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR)కి కమీషన్ రూపంలో నిధులను అందజేస్తున్నట్లు తెలిసింది. అదే టీడీఎస్ డేటా నుంచి కూడా ప్రతిబింబిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా CPRకి రూ. 12.71 లక్షలు చెల్లించినట్లు చూపింది ఆక్స్‌ఫామ్ ఇండియా...," అని సీబీఐ ఫిర్యాదులో పేర్కొంది.
సీబీడీటీ ఆదాయపు పన్ను సర్వేను నిర్వహించింది.. ఇది ఆక్స్‌ఫామ్ ఇండియా, FCRA 2010 ద్వారా నిర్దేశించిన నిబంధనలను దాటవేయాలని యోచిస్తోందని వెల్లడించింది. నిబంధనలను అధిగమించేందుకు ఇతర FCRA-నమోదిత సంఘాలకు లేదా లాభాపేక్షతో కూడిన కన్సల్టెన్సీ మార్గంలో నిధులను మళ్లించేందుకు సంస్థ ప్రణాళికలు వేస్తోందని ఆరోపించారు. ఆక్స్‌ఫామ్ ఇండియా విదేశీ సంస్థలు,లేదా సంస్థకు సంవత్సరాలుగా ఉదారంగా నిధులు సమకూరుస్తున్న సంస్థలకు విదేశాంగ విధానం సాధనంగా పనిచేస్తుండవచ్చని సర్వే కనుగొంది. ఆక్స్‌ఫామ్ ఇండియా తన సహచరులు, ఉద్యోగుల ద్వారా సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR)కి కమీషన్ రూపంలో నిధులను మళ్లించిందని ఆరోపించారు.
ఆక్స్‌ఫామ్ ఇండియా అనేది భారతదేశంలోని పేదరికం, అసమానత సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ. 1951లో స్థాపించబడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, లింగ సమానత్వం, విద్య, మానవ హక్కులను ప్రోత్సహించడంలో చురుకుగా ఉంది.
అయితే, గత ఏడాది డిసెంబర్‌లో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆక్స్‌ఫామ్ ఇండియా తన FCRA లైసెన్స్‌ను పునరుద్ధరించాలని చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది. గత నెలలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పబ్లిక్ థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (CPR) ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. లైసెన్స్ సస్పెన్షన్ కారణంగా థింక్-ట్యాంక్ విదేశాల నుంచి ఎటువంటి నిధులను స్వీకరించలేరు.












Click it and Unblock the Notifications