అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, న్యాయ వ్యవస్థను శాసించేలానా?: ట్విట్టర్‌కు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించింది.

ట్విట్టర్ ఉద్దేశ పూర్వకంగానే ఉల్లంఘనలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందా? అని మండిపడింది. ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఐటీ శాఖ ఆరోపించింది. అనవసరపు గోల చేయడం మాని భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. మీ విదేశీ ఎంటిటీ మాకు పాఠాలు చెప్పనవసరం లేదని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తుందని పేర్కొంది.

ఈ దేశ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిందే..
ట్విట్టర్ చేసిన వ్యాఖ్యలు తమను శాసించే విధంగా ఉన్నాయని, ఈ వైఖరిని సహించబోమని కేంద్ర హెచ్చరించింది. 'మీరు మీ చర్యలతో భారతీయ న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, మీరు మాకు నీతి వ్యాఖ్యలు చెప్పవలసని పనిలేదని ట్విట్టర్‌కు కేంద్రం తేల్చి చెప్పింది. ఈ దేశ చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Recommended Video

మీది సోషల్ మీడియా మాత్రమే..
'మీది సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మాత్రమే.. అది గుర్తుంచుకోండి. మా లీగల్ పాలసీని శాసించే లేదా ఇందులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు.. దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది' అని కేంద్రం పేర్కొంది. కాగా, ఇండియాలో భావప్రకటనా స్వేచ్ఛ పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ అనుచిత అభిప్రాయాలను వ్యక్తికీరించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇండియాలో తమ సంస్థ ఉద్యోగుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఘాటుగా స్పందించింది. మరోవైపు, 'కాంగ్రెస్ టూల్ కిట్' అంటూ బీజేపీ నేతలు చేసిన పోస్టులకు ట్విట్టర్.. మానిప్యులేటెడ్ మీడియా అని ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ ఢిల్లీ పోలీసులు.. ఢిల్లీ, గుర్గావ్ ట్విట్టర్ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. సరైన సమాధానం కోసం వేచిచూస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications