మోటార్ వెహికల్స్ రూల్స్ లో కీలక సవరణలు చేసిన కేంద్రం
దేశంలో పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను విస్తరించే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు అవసరమైన సవరణలు చేపట్టింది. 100 శాతం వరకు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల (E100) వినియోగానికి బాటలు వేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. మోాటర్ వెహికల్స్ యాక్ట్ లో ఇంధనం, పొల్యూషన్ టెస్ట్ వంటి నిబంధనలను మార్పు చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ85, ఈ100 వంటి హై- ఇథనాల్ మిళిత ఇంధనాలను వినియోగించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణ పెట్రోల్ లేదా ఈ20కి అనుగుణంగా తయారైన సాంప్రదాయ వాహనాలలో ఈ రకమైన అధిక ఇథనాల్ ఇంధనాలను వాడటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల బరువు పరిమితిని గతంలో ఉన్న 3,000 కిలోల నుంచి 3,500 కిలోలకు పెంచింది కేంద్రం.

ఈ విధానపరమైన మార్పులతో దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్ల తయారీపై ప్రత్యేక దృష్టి సారించడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఇప్పటికే మారుతి సుజుకి తన వేగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్‌ను ప్రవేశపెట్టింది కూడా. ఈ కారు ఈ20 నుంచి ఈ100 వరకు ఏ రకమైన ఇథనాల్ పెట్రోల్ మిశ్రమంతోనైనా నడుస్తుంది. మారుతితో పాటు టయోటా మోటార్, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను తయారు చేస్తోన్నాయి.
ఇథనాల్ ప్రోత్సాహానికే మాత్రమే పరిమితం కావట్లేదు కేంద్రం. ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కూడా సమగ్ర చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బీ100 బయోడీజిల్, హైడ్రోజన్ సీఎన్‌జీ కాంబినేషన్లతో నడిచే వాహనాలకు సంబంధించి సాంకేతిక నిబంధనలు, పొల్యూషన్ టెస్ట్ లల్లో తగిన మార్పులు చేసింది.
చెరకు, మిగులు ధాన్యాల ద్వారా దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వాడకం పెరగడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు నియంత్రణలోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇథనాల్ ను అధికంగా వినియోగించడం వల్ల దేశీయ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుదని, రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెబుతోంది. తక్కువ వ్యయంలో ఇంధనం లభించే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో వాహనదారులపై కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
