అమెరికా ఆ వర్సిటీలకు వెళ్లేవారికి వార్నింగ్, అందుకే తిప్పి పంపారా?
న్యూఢిల్లీ: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయాలకు వెళ్లే వారికి భారత విదేశాంగ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ చదువుకోవడానికి వెళ్లే వారు తమ స్టడీ టూర్‌ను కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించింది.
అక్కడకు చదువుకోవడానికి వెళ్తే తిప్పి పంపిస్తారని విదేశాంగ శాఖ హెచ్చరించింది. సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ రెండు విశ్వవిద్యాలయాలకు వెళ్లవద్దని, వాయిదా వేసుకోవాలని సూచించింది. సమస్య పైన అమెరికా స్పందన తెలియాల్సి ఉందని పేర్కొంది.
మరోవైపు, వ్యాలిడ్ వీసాలతో అమెరికా వస్తున్న వారిని హోంల్యాండ్ అధికారులు నిరాకరించడం పైన ఆమెరికాను భారత్ వివరణ కోరింది. అయితే, భారత్‌కు ఇప్పటి వరకు అమెరికా సమాచారం ఇవ్వలేదు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌కు వెళ్లేటప్పుడు స్టడీ ప్లాన్, హౌసింగ్, ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్త్ కేర్, ట్రావెల్ డాక్యుమెంట్లు వెంట తీసుకు వెళ్లాలని సూచించింది.
ఆదివారం నాడు హైదరాబాదులో 19 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లకుండా నిలిపేసిన విషయం తెలిసిందే. వారు సాన్ జోస్‌లోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ, ఫ్రెమెంట్ సమీపంలోని నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ వర్సిటీల్లో చేరేందుకు వెళ్తుండగా ఆపేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆ రెండు విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం అమెరికా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఆ విద్యార్థులను అందుకే పంపించారా?
సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలలో చేరేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపడంలో తమ తప్పిదం లేదని ఆయా వర్సిటీల అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ఇమ్మిగ్రేషన్ అనుమతులు తీసుకునే సమయంలో అక్కడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారని, అందుకే వారిని తిప్పి పంపారన్నారు.
ఇమ్మిగ్రేషన్ సమయంలో చదువుకుంటూ అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తారా? అని అడిగితే, చేస్తామని విద్యార్థులు చెప్పారని, అలాగే అమెరికాలో విద్యనభ్యసించేందుకు సరిపడా ఆర్థిక స్తోమతను అధికారులకు చూపడంలో విఫలమయ్యారని, ఎంత మంది వచ్చారని సంధించిన ప్రశ్నకు... తాము 15 మందిమి వచ్చామని చెప్పడం కూడా వారిని తిరస్కరించడంలో కీలక పాత్ర పోషించాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications