సీజేఐ డీవై చంద్రచూడ్ కొత్త టీమ్..!!
దేశ అత్యున్నత న్యాయస్థానానికి అయిదుమంది కొత్త న్యాయమూర్తులు రానున్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పని చేస్తోన్న వారిని కేంద్రం సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేసింది.
న్యూఢిల్లీ: దేశ న్యాయవ్యవస్థలో జరిగే నియామకాలన్నీ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకునే నిర్ణయాలు, సిఫారసుల మీదే ఆధారపడి ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులను నియమించడం, సీనియర్ అడ్వొకేట్లు, జ్యుడీషియరీ అధికారులను న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడంలో ఈ కొలీజియానిదే కీలక పాత్ర. ఈ వ్యవస్థ ద్వారానే హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఏర్పడే ఖాళీలను భర్తీ జరుగుతోంది.
ఈ విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధికి కూడా చోటు కల్పించాలని కోరుతోంది. కొద్దిరోజులుగా ఈ విషయం మీదే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సహా కొందరు సీనియర్ నాయకులు స్పందిస్తోన్నారు. ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థలో మార్పులు చేయాలంటూ పట్టుబట్టుతున్నారు.

ఇది కాస్తా సుప్రీంకోర్టు- కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణపూరక వాతావరణానికి దారి తీసినట్టయింది. కిరణ్ రిజిజు ఏకంగా కొలీజియం వ్యవస్థను తప్పుపట్టారు. పారదర్శకంగా పనిచేయట్లేదనీ వ్యాఖ్యానించారు. అదొక బాధ్యతారాహిత్యమైన వ్యవస్థగా ఆయన అభివర్ణించారు. కొలీజియం స్థానంలో ప్రత్యేకంగా ఓ ఫెడరల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రతినిధిగా న్యాయ శాఖ మంత్రికి కూడా చోటు ఉంటుందని చెప్పుకొచ్చారు. కొలీజియం చేసిన సిఫారసులను కూడా ఆమోదించలేని పరిస్థితి నెలకొంది.
ఈ పరిణామాల మధ్య తాజాగా- కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. కొలీజియం సిఫారసులపై ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టుకు అయిదుమంది కొత్త న్యాయమూర్తులను నియమించింది. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పని చేస్తోన్న వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇంందులో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ , పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. ఈ మేరకు కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించింది.












Click it and Unblock the Notifications