ఎలా ఉన్నది అలా: జింఖానా క్లబ్ స్థలాన్ని అప్పగించాలని కేంద్రం ఆదేశాలు- డెడ్ లైన్ సైతం
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ జింఖానా క్లబ్ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర ప్రజా ప్రయోజనాలు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నంబర్ 2, సఫ్దర్‌జంగ్ రోడ్‌లో ఉన్న ఈ స్థలాన్ని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. భూ బదలాయింపునకు డెడ్ లైన్ సైతం పెట్టింది కేంద్రం. జూన్ 5వ తేదీ కల్లా ఈ భూమి మొత్తాన్ని కూడా తమకు అప్పగించాలని సూచించింది.
ఈ మేరకు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను వెలువడించింది. ఈ ఆదేశాల ప్రకారం.. ఢిల్లీ జింఖానా క్లబ్‌కు సామాజిక, క్రీడా కార్యకలాపాలను నిర్వహించడానికి కేంద్రం ఈ భూమిని లీజుకు ఇచ్చింది. 27.3 ఎకరాల స్థలం ఇది. లీజు గడువు ఇంకా ఉన్నప్పటికీ.. ఈ స్థలాన్ని తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం జింఖానా క్లబ్ లిమిటెడ్ ను ఆదేశించింది. దేశ రాజధానిలో అత్యంత సున్నిత, వ్యూహాత్మక ప్రాంతంలో ఈ భూమి ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.

రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఇతర ప్రజా భద్రతా ప్రయోజనాల కోసం ఈ స్థలం ఇప్పుడు అత్యవసరంగా అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. సమీపంలోని ప్రభుత్వ స్థలాలతో కలిసి జింఖానా క్లబ్ గ్రౌండ్ లో అత్యవసర సంస్థాగత అవసరాలు, పాలనా మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజన ప్రాజెక్టులకు దీన్ని వినియోగించదలచినట్లు తేల్చి చెప్పింది. జూన్ 5వ తేదీ నాటికి స్థలాన్ని బదలాయించాలని సూచించింది.
ఢిల్లీ జింఖానా.. దేశంలోని పురాతన, ప్రముఖ క్లబ్‌లలో ఒకటి. 1913 జులైలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా పిలిచేవారు. స్పెన్సర్ హార్కోర్ట్ బట్లర్ దీనికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో స్వాతంత్య్రానంతరం ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఢిల్లీ జింఖానా క్లబ్‌గా మారింది. క్లబ్ ప్రారంభ రోజుల్లో పోలో క్లబ్ జింఖానాలో భాగంగా కొనసాగింది. 1930వ దశకంలో స్వతంత్ర సంస్థగా రూపాంతరం చెందింది.
క్లబ్ స్థాపనకు సంబంధించిన చారిత్రక రికార్డులు కొంతవరకు పరిమితంగా ఉన్నాయని తెలుస్తోంది. దీని చరిత్రకు సంబంధించిన సమగ్ర డాక్యుమెంటేషన్ 1927 తర్వాత మాత్రమే అధికారికంగా ప్రారంభమైనట్లు సమాచారం. ఒప్పందం క్లాజ్ 4 ప్రకారం.. లీజు స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాల్సి వస్తే గడువు తీరడానికి ముందే దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు అదే చేసింది కేంద్రం.
ఈ అధికారాలను వినియోగించుకుంటూ లీజును రద్దు చేసింది. ఆస్తిని తక్షణమే తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మొత్తం 27.3 ఎకరాల మొత్తం స్థలాన్ని ఎలా ఉన్నది అలా అంటే.. అందులో నిర్మించిన అన్ని భవనాలు, నిర్మాణాలు, పచ్చిక బయళ్ళు, ఇతర ఫిట్టింగ్‌లు, మిగులు భూమి, అభివృద్ధి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పూర్తిగా సంక్రమిస్తాయి. ఈ ఆస్తిపై రాష్ట్రపతికి సంపూర్ణ అధికారం ఉంటుందని స్పష్టమైంది.












Click it and Unblock the Notifications