బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపై సోరెన్
రాంచీ: అసెంబ్లీ ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేఎంఎంకు రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో చంపై సోరెన్ తన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు.
కాషాయ పార్టీలోకి స్వాగతించిన తర్వాత చంపై సోరెన్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంపై.. కొంతకాలంగా ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపై సోరెన్ వైదొలగారు. సీఎం పగ్గాలు మళ్లీ హేమంత్ సోరెన్ చేతికి వెళ్లిపోయాయి.

ఈ క్రమంలో సొంత పార్టీ అధినాయకత్వంపై చంపై సోరెన్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. జేఎంఎం పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని చంపై ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన చంపై.. జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
VIDEO | Former Jharkhand CM and former JMM leader Champai Soren (@ChampaiSoren) joins BJP along with this supporters at an event in Ranchi. #ChampaiSoren pic.twitter.com/vdZmKwVm3g
— Press Trust of India (@PTI_News) August 30, 2024
ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందన్న చంపై సోరెన్.. తాజాగా శుక్రవారం బీజేపీలో చేరిపోయారు. కాగా, చంపై సోరెన్ సెరైకెల్లా నియోజవకర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై సేవలందించారు.
హేమంత్ సోరెన్ కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చంపై సోరెన్ జార్ఖండ్ టైగర్‌గా పేరొందారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. 1956లో జిలింగోరా గ్రామంలో చంపై సోరెన్ జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు చదివారు.












Click it and Unblock the Notifications