నాటి హైదరాబాద్‌లా.. ఢిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థులకు మద్దుతగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే షాద్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆప్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతోపాటు పొలిటికల్ కాలుష్యం కూడా పెరిగిపోయిందన్నారు.
1995లో హైదరాబాద్ ఎలా ఎండేదో.. ఇప్పుడు ఢిల్లీ అలా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండివుంటే.. వాషింగ్టన్, న్యూయార్క్‌ను తలదన్నేదన్నారు. 2025లో దావోస్‌లో ప్రపంచం మొత్తం చర్చించిన ప్రధాన అంశాలు ఏఐ, గ్రీన్ ఎనర్జీ అని తెలిపారు. 1995లో తాను ఐటీ గురించి మాట్లాడన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏఐపై దృష్టి సారించినట్లు చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏఐని ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇది మోడీ విజన్ అని అన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగువాళ్లు ఇంటింటికీ వెళ్లి.. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పాలన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నాడంటూ మోడీపై ప్రశంసలు కురిపించారు.
ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మారుమోగుతోందని చంద్రబాబు తెలిపారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. దేశ రాజధాని సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ఇక్కడి ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. మోడీ ఆక్సిజన్ ఇవ్వాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు, తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, తదితరులు ఆ పార్టీ తరపున ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications