టీపై రాజ్‌నాథ్ ప్రకటన: బిజెపితో పొత్తుపై బాబు వెనక్కి
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి వెనకాడుతుండడంతో బిజెపితో పొత్తుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వబోమంటూ బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ప్రకటనలు చేస్తూ వచ్చారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తెలంగాణపై వెనకాడుతున్నట్లు కనిపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వారిని ప్రభావితం చేశారనే మాటలు వినిపించాయి. ఈ స్థితిలో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇస్తుందా, లేదా అనే అనుమానాలు తలెత్తాయి. ఇది బిజెపిలో అంతర్గత విభేదాలకు కూడా దారి తీసింది.
తన నేతల తీరు పార్టీకి నష్టం చేసే పరిస్థితి వచ్చిందనే భావనతో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణపై ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు మద్దతు ఇస్తామంటూ చెప్పారు. దీంతో చంద్రబాబు బిజెపితో పొత్తుపై పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్‌నాథ్ ప్రకటనతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

"తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మేం కోరుకుంటున్నాం. దానికి మేం మద్దతిస్తాం. పార్టీ అధ్యక్షుడిగా ఇదీ నా మాట'' అంటూ బిజెపి అధినేత రాజ్‌నాథ్ సింగ్ గురువారం సాయంత్రం ఢిల్లీలో చేసిన ప్రకటన తెలుగుదేశం సీమాంధ్ర నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
సీమాంధ్రకు న్యాయం చేయకుండా తెలంగాణ బిల్లుపై ముందుకు పోరాదని వాదిస్తూ బిజెపిని ప్రభావితం చేసి, తెలంగాణను అడ్డుకునే ఎత్తుగడలను చంద్రబాబు అనుసరిస్తూ వచ్చారు.
బిజెపి అగ్రనేత అద్వానీ కూడా కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వాదననే వినిపిస్తూ వచ్చారు. ప్రస్తుత రూపంలో తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో తమ పార్టీ మద్దతివ్వబోదని కూడా ఆయన పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, బిజెపి మధ్య బంధం పెరుగుతూ వచ్చింది.
అయితే, గురువారం సాయంత్రం తెలంగాణ బిల్లుపై రాజ్‌నాథ్ తాజా ప్రకటన చంద్రబాబుకు ఏ మాత్రం మింగుడు పడలేదని అంటున్నారు. అద్వానీ, సుష్మా స్వరాజ్ వైఖరిని వీటో చేసే రీతిలో రాజ్‌నాథ్ ప్రకటన ఉందని భావిస్తూ బిజెపితో పొత్తుపై వెనక్కి తగ్గాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications