చంద్రాయన్ 3 ప్రయోగంలో కీలక దశ పూర్తి..
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.
ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుందీ రాకెట్. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3తో అనుసంధానించింది.

ఇవ్వాళ చంద్రయాన్ 3 ప్రయోగం పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను విజయవంతంగా ముగించింది ఇస్రో. సోమవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ 24 గంటల రిహార్సల్.. ఇవ్వాళ ముగిసింది. ఇది విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఇక ప్రయోగానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యామని తెలిపింది. 24 గంటల పాటు సాగిన ఈ లాంచ్ రిహార్సల్ ముగిసిందంటూ ఇస్రో ట్వీట్ చేసింది.
Chandrayaan-3 mission:
— ISRO (@isro) July 11, 2023
The ‘Launch Rehearsal’ simulating the entire launch preparation and process lasting 24 hours has been concluded.
Mission brochure: https://t.co/cCnH05sPcW pic.twitter.com/oqV1TYux8V
43.5 మీటర్ల పొడవు ఉన్న ఈ రాకెట్ మూడు రకాల ప్రొపెల్లెంట్‌లను ఉపయోగిస్తుంది. ఈ ప్రొపెల్లెంట్లల్లో గల స్ట్రాప్-ఆన్ బూస్టర్‌లలో ఘన రూపంలో ఉన్న ఇంధనాన్ని వినియోగించింది. కోర్ దశలో ద్రవ ఇంధనం, చివరిదశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని వాడారు. 204.5 టన్నుల ఘన ఇంధన శక్తి.. బూస్టర్లకు లభించినట్లు ఇస్రో తెలిపింది.
కోర్ స్టేజ్, అప్పర్ స్టేజ్‌లల్లో ఒక్కొక్కటి 115.8, మరియు 28.6 టన్నుల ప్రొపెల్లెంట్‌లను కలిగి ఉంటాయి. 3,900 కేజీల చంద్రయాన్ 3 బరువును కూడా పరిగణనలోకి తీసుకుంటే- రాకెట్ మొత్తం 642 టన్నుల బరువును మోసుకుంటూ చంద్రమండలం వైపు దూసుకెళ్తుంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రయోగం ఉంటుంది. అంతకుముందే కౌంట్ డౌన్ చేపడుతుంది ఇస్రో.












Click it and Unblock the Notifications