సెల్ఫీ అడిగితే చెంప ఛెల్లుమనిపించిన స్టాలిన్(వీడియో)
చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఇటీవలో మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అది కూడా.. ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించినందుకే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. గురువారం కోయంబత్తూరు పర్యటనలో ఉన్న స్టాలిన్ తన చుట్టూ మూగిన జనాలతో అసౌకర్యానికి గురయ్యారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆయనకు చేరువగా వచ్చి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. అంతే అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా అతడిని నెట్టివేశారు.
ఆ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వాట్సాప్‌లోనూ విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వీడియోపై స్టాలిన్ శుక్రవారం స్పందిస్తూ ...ఆ వీడియోలో గ్రాఫిక్స్ యాడ్ చేశారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
అయినా ఆ సంఘటనను తాను పట్టించుకోనని చెప్పుకొచ్చారు. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు.

కాగా, ఈ సంఘటనపై స్టాలిన్ మేనేజర్ ఇచ్చిన వివరణ పూర్తి విరుద్ధంగా ఉంది. అది యాదృచ్చికంగా జరిగిందని..స్టాలిన్‌ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications