రక్తమోడిన దండకారణ్యం
Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. కాల్పుల మోతలతో దండకారణ్యం మార్మోగింది. తాజాగా చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
తాజాగా సంభవించిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మరణించారు. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. నారాయణ్‌పూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఏడుగంటల పాటు ఏకధాటిగా కొనసాగాయి.

దంతెవాడ పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందిన నేపథ్యంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ నిర్వహించారు. ఈ తెల్లవారుజామున కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. పరస్పరం ఎదురుకాల్పలకు దిగారు.
ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మరణించారు. తొలుత వారిని లొంగిపోవాలంటూ హెచ్చరించామని, దీన్ని పట్టంచుకోకుండా మావోయిస్టులు కాల్పులకు దిగారని బస్తర్ రేంజ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ పీ సుందర్ రాజ్ తెలిపారు. దీనితో పోలీసులు, భద్రత బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయని పేర్కొన్నారు.
ఈ ఘటనలో మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారని, మధ్యాహ్నానికి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని సుందర్ రాజ్ చెప్పారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం ఉందని, వారికోసం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని చెప్పారు.
కిందటి నెల సుక్మాజిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు ఇదే నారాయణ్‌పూర్ సమీపంలోని అబూజ్‌మఢ్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వారిని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications