కాంగ్రెస్‌లో బీజేపీ పాలిటిక్స్: ఆ ముఖ్యమంత్రికి పదవీ గండం: హడావుడిగా ఢిల్లీకి..రాజీనామా?
న్యూఢిల్లీ: కొద్దిరోజుల కిందటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించిన ముఖ్యమంత్రికి పదవీ గండం ఏర్పడింది. శాసన సభ్యుల్లో నెలకొన్న అసంతృప్తి, పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల మధ్య బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇప్పుడు అవే తరహా పరిస్థితులు, అదే తరహా రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌లో నెలకొన్నాయి.

ఉద్వాసన కత్తి..
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. పదవీ గండాన్ని ఎదుర్కొంటోన్నారు. ఆయన మెడపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది. కర్ణాటక తరహాలోనే భూపేష్ బఘేల్ కూడా సొంత పార్టీకి చెందిన శాసన సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోన్నారు. ముఖ్యమంత్రి పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. ఆయనను తప్పించాలనే ఏకైక డిమాండ్‌తో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేశ రాజధాని బాట పట్టారు. వారంతా పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోనున్నారు.

సీఎం కంటే ముందే ఢిల్లీలో మకాం..
భూపేష్ బఘేల్ కంటే ముందే వారంతా హస్తినలో తిష్ఠ వేయడం.. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి తీవ్రతను చాటుతోంది. పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో బఘేల్.. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాయ్‌పూర్ విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీని తాను కలవాల్సి ఉందని అన్నారు. రాహుల్ గాంధీతో సమావేశం కావాలంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి తనకు సమాచారం అందిందని, అందుకే ఢిల్లీ వెళ్తోన్నానని చెప్పారు.

ఢిల్లీకి బఘేల్..
ముఖ్యమంత్రిని మార్చుతారనే సమాచారం ప్రస్తుతానికి తన వద్ద లేదని భూపేష్ బఘేల్ వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీతో సమావేశమైన తరువాత.. ఈ విషయంపై తనకు ఓ స్పష్టత లభించే అవకాశం ఉందని అన్నారు. గురువారం రాత్రే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం పట్ల ఆయన స్పందించారు. తనను పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు రావడం వల్ల ఢిల్లీకి వెళ్తోన్నానని, వారిని ఎవరు పిలిచారో తనకు తెలియదని అన్నారు.

ఇన్‌ఛార్జ్‌తో ఎమ్మెల్యేలు భేటీ..
ఎలాంటి ఆహ్వానం లేకుండానే కొందరు ఢిల్లీకి వెళ్తున్నారని అసంతృప్త ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది తనకు ఇప్పుడే తెలియదని బఘేల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పు గురించి ప్రస్తుతానికి తానేమీ వ్యాఖ్యానించలేననీ అన్నారు. కాగా- ఇప్పటికే ఢిల్లీకి చేరిన పలువురు అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఛత్తీస్‌గఢ్ పార్టీ ఇన్‌ఛార్జ్ పీఎల్ పునియాతోనూ భేటీ అయ్యారని తెలుస్తోంది.

పదవి షేరింగ్..
2018లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే డిమాండ్ అప్పట్లోనే వినిపించింది. తొలుత భూపేష్ బఘేల్.. ఆ తరువాత మరో నాయకుడు పదవిని పంచుకోవాల్సి ఉంటుందనే షరతును పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. కిందటి నెలతో భూపేష్ బఘేల్ రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది.
Recommended Video

సింగ్ దేవ్ పేరు..
దీనితో రాజీనామా చేయాలని, మరొకరికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌తో అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. భూపేష్ బఘేల్ రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే.. ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ- సింగ్ దేవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సింగ్ దేవ్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ శ్రేణుల్లో. అది ఎంతవరకు నిజమౌతుందనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications