నేడే మొదటి టీ20: వైభవ్ సూర్యవంశీ కోసం అభిషేక్ శర్మ బలి?
టీమిండియా టీ20 క్రికెట్‌లో నేడు నూతన శకం ప్రారంభం కాబోతోంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్ లకు అడుగు పడబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బెల్ ఫాస్ట్ దీనికి వేదిక. ఈ సిరీస్ టీమిండియా సమూలంగా మారిపోయింది. భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కు ఇది మొదటి మ్యాచ్ కాబోతోంది. తుదిజట్టులో వైభవ్ సూర్యవంశీని తీసుకుంటే.. అతను చరిత్రను తిరగరాసినట్టవుతుంది.
ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు అత్యంత కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు టీ20 ప్రపంచకప్ విజయ సంబరాల్లో మునిగితేలిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అనూహ్యంగా నాయకత్వ బాధ్యతల నుండి తొలగించడమే కాకుండా, ఏకంగా జట్టు నుంచి కూడా పక్కన పెట్టడం విశేషం.ఐపీఎల్ లో సత్తా నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి టీ20ల్లోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా సారథ్య బాధ్యతలను అప్పగించింది సెలెక్షన్ కమిటీ.

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై
ఈ సిరీస్‌పై విస్తృతంగా చర్చ జరగడానికి మరో ప్రధాన కారణం 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ భారత జట్టుకు ఎంపికై అరుదైన రికార్డును నెలకొల్పాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన ఈ ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.
వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేయాలంటే టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సవాలు ఎదురుకానుంది. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా దూసుకుపోతున్న అభిషేక్ శర్మను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వస్తుంది. ఇద్దరూ కూడా లెఫ్ హ్యాండ్ ఓపెనర్లే. టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపాల్సి వస్తే, వైభవ్‌కు చోటు ఇవ్వడం సెలెక్టర్లకు అంత సులువైన నిర్ణయం కాకపోవచ్చు.
యువ ఆటగాళ్లు, బౌలింగ్ విభాగాల అంచనా
మిడిలార్డర్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. సాధారణంగా మూడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగనుండగా, నాలుగో స్థానంలో స్వయంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలను భుజాన వేసుకోనున్నాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అయిదు, టీ20 స్పెషలిస్ట్ శివమ్ దూబే ఆరు స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశాలు లేకపోలేదు.
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు గాయం నుంచి కోలుకున్న యువ స్పీడ్‌స్టర్ హర్షిత్ రాణా పేస్ విభాగానికి బలం చేకూర్చనున్నాడు. వరుణ్ చక్రవర్తి కాలి గాయంతో దూరమవడంతో ప్రిన్స్ యాదవ్ ఈ సిరీస్ కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అదరగొట్టాడీ బౌలర్. అలాగే మోకాలి కండరాల నొప్పితో బాధపడుతున్న నితీశ్ రెడ్డి స్థానంలో ముంబై అన్‌క్యాప్డ్ బ్యాటర్ సూర్యాంశ్ షెడ్గేను సెలక్టర్లు ఎంపిక చేశారు.
భారత క్రికెట్ భవిష్యత్తు ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఐర్లాండ్ మెరుపు ద్వైపాక్షిక సిరీస్ ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త కెప్టెన్ సలహాలు, వ్యూహాత్మక మార్పులతో పాటు మన దేశవాళీ ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాల దిశగా తీసుకెళ్లేందుకు ఇదొక ప్రయోగాత్మక వేదిక కానుంది. ఈ పోరు ముగిసిన వెంటనే భారత జట్టు మరింత పటిష్టమైన ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications