నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధి
పార్టీకి రాజీనామా చేసిన జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలాను బుజ్జగించడానికి బీజేపీ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. తన రాజీనామా నిర్ణయం నుంచి ఆయన వెనక్కి రావట్లేదు. రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, నాటి లేఖను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ రాజీనామా పత్రాన్ని ఇప్పటికైనా ఆమోదించాలని కోరారు. ఈ మేరకు తాజాగా మరో లేఖ రాశారు.
ఈ లేఖను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు షెహజాద్ పూనావాలా. వ్యక్తిగత, ఆర్థిక కారణాల దృష్ట్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఆ సిద్ధాంతాలకు దూరం కాలేదని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి గానీ, కుటుంబానికి గానీ న్యాయం చేయలేననే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని స్పష్టం చేశారు.

కిందటి నెల జులై 30న పూనావాలా మొదటిసారి పార్టీ హైకమాండ్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. బీజేపీ నాయకత్వం దానిని వెంటనే ఆమోదించడానికి నిరాకరించింది. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పార్టీ అగ్రనేతలు కోరారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ బుజ్జగించారు. వీటిని ఆయన సున్నితంగా తోసిపుచ్చారు. పార్టీ చూపిన ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూనే.. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. రాజీనామా నుంచి వెనక్కి తగ్గట్లేదని తేల్చిచెప్పారు.
తన రాజీనామా వెనుక ఉన్న ప్రధాన కారణాలను పూనావాలా ఈ తాజా లేఖలో సుదీర్ఘంగా వివరించారు. కొన్ని అనివార్యమైన వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు, ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కూడా తన నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పని పరిస్థితిని కల్పించాయని చెప్పుకొచ్చారు.
రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయన నిర్ణయాలను ఎప్పుడూ సమర్థిస్తానని వివరించారు. ప్రైవేట్ రంగంలో నూతన ప్రయాణం ప్రారంభిస్తోన్నప్పటికీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతుగా నిలుస్తానని చెప్పారు. పాశ్మాండ ముస్లిం వర్గానికి చెందిన సాధారణ యువకుడికి జాతీయ స్థాయి అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించడం బీజేపీలోనే సాధ్యమవుతుందని కొనియాడారు.
Resignation Letter.
— Shehzad Jai Hind (@Shehzad_Ind) August 17, 2026
With utmost humility, sense of affection & gratitude i have once again submitted my resignation letter to @BJP4India & Hon’ble Shri @NitinNabin ji & have requested that the same be accepted.
Eternally grateful for guidance, love, respect and platform that… pic.twitter.com/yUvyJiWNdX













Click it and Unblock the Notifications