అరుణాచల్ ప్రదేశ్ మాదే.. ఆమెను వేధించలేదు: చైనా
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ ప్రేమ వాంగ్ జోమ్ పై చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టు అధికారులు వేధింపులకు గురిచేశారు. అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలోని దంటూ.. అందువల్ల ఈ పాస్ పోర్ట్ చెల్లదని వాంగ్ జోమ్ ను ఇబ్బందులకు గురిచేశారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాదేనంటూ తన భారత పాస్ పోర్టును గుర్తించేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. చైనీస్ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రేమ వాంగ్ జోమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. అయితే తాజాగా ఆమె ఆరోపణలను చైనా ఖండించింది. రూల్స్ , చట్టానికి లోబడే ఆమెను విచారించినట్లు పేర్కొంది.
చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టులో భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళను అక్కడి అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమంటూ తనను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించారంటూ ప్రేమ వాంగ్ జోమ్ పోస్టు పెట్టారు. 'నేను యూకే నుంచి జపాన్ వెళ్తూ షాంఘై విమానాశ్రయంలో 3 గంటలపాటు ఆగాను. ఎయిర్ పోర్ట్ అధికారులు.. అరుణాచల్ చైనాలో భాగమని.. నా పాస్ పోర్ట్ చెల్లదని చెప్పారు. దాదాపు 18 గంటల పాటు నన్ను నిర్భందించారు. సరైన ఆహారమూ ఇవ్వలేదు. చివరికి ఇండియన్ కాన్సులేట్ సాయంతో బయటపడ్డాను' అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
అయితే ఈ ఘటనపై చైనా స్పందించింది. షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టులో ప్రేమ వాంగ్ జోమ్ పై వేధింపులు చేయలేదని స్పష్టంచేసింది. ఆమె వ్యాఖ్యలను చైనా ఖండించింది. ఆమె ఎలాంటి నిర్భంధం, వేధింపులకు గురి కాలేదని స్పష్టం చేసింది. అలాగే జంగ్ నాన్(అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగంలోదేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు.

ఇక ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. చైనా వ్యాఖ్యలను తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో భాగమేనని స్పష్టం చేసింది. అలాగే భారత పౌరులకు ఇండియన్ పాస్ పోర్టుతోనే ఇతర దేశాలకు వెళ్లడానికి అన్ని హక్కులు ఉన్నాయని పేర్కొంది. చైనా అధికారులు.. అంతర్జాతీయ సివిన్ ఏవియేషన్ రూల్స్ ను అధిగమించారని తెలిపింది. ఇదే ఘటనపై అరుణాచల్ సీఎం పేమ ఖండూ మాట్లాడుతూ.. తాను షాక్ కు గురైనట్లు తెలిపారు. భారత పౌరుల గౌరవాన్ని కించపరిచేలా చైనా వ్యవహరించడంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications