సీజేపీ నేతలకు బిగ్ రిలీఫ్.. సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా విడుదలకు ఆదేశం
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలైన సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా ల విడుదలకు మార్గం సుగమమైంది. 7 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారికి తాజాగా బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు వారిని విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇరువురి జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అక్టోబర్ 13న దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న కేసులో సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలు ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం పేపర్ వర్క్ కారణంగా వారి రిలీజ్ కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక దిల్లీ పోలీసులు మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నారు. మరోవైపు వారి అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు వాళ్లని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణ ప్రక్రియలో భాగంగా వాళ్లు పూచీకత్తులను కూడా సమర్పించారు. మరోవైపు దాస్, రాంకాల పిటిషన్ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ప్రకారం సౌరవ్ దాస్ వయసు 27 కాగా.. రాంకా వయసు 31 గా తేలింది. అంటే జెన్ జీ ఉద్యమం చేస్తున్న వీరు అసలు జెన్ జీ కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.. కాక్రోచ్ జనతా పార్టీ నేతలైన అశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్ ల అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా ఎగురవేసినందుకు వీళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని.. గతంలో వాళ్లు సంతకం చేసిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ జ్యూడిషియల్ కస్టడీకి తరలించారని స్పష్టం చేశారు. భువనేశ్వర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అశుతోశ్ రాంకా, సౌరవ్ దాస్ ల వయసు 27, 31 ఏళ్లుగా ఉందని.. వీళ్లు జెన్-జీ కాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
