రెండు రాష్ట్రాల ఏర్పాటు తేదీపై త్వరలో స్పష్టత
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది వారం గడుస్తున్నప్పటికీ రెండు రాష్ట్రాలు ఎప్పుడు ఉనికిలోకి వస్తాయనే తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఆ తేదీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. అయితే, త్వరలోనే దానిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మొహంతీని ఆహ్వానించింది. బుధావరం జరిగే సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీపై స్పష్టత రావచ్చునని అంటున్నారు. విభజనను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు మొహంతీని అడిగి తెలుసుకోనున్నారు.

రెండు రాష్ట్రాల వ్యవహారాలను నడిపించడానికి, శాంతిభద్రతలను కాపాడడానికి చేసిన ఏర్పాట్లపై మొహంతీ ఓ నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి జరిగిన ఏర్పాట్లపై కూడా ఆయన వివరించే అవకాశాలున్నాయని అంటున్నారు.
మొహంతీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్యాడర్‌కు సంబంధించిన వివరాలను ఆయన తీసుకున్నారు. అపాయింటెడ్ డేట్‌ను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముదే అది జరుగతుందని అనుకుంటున్నారు
క్యాడర్, ఆస్తులు, అప్పులకు సంబంధించిన పంపిణీకి సిద్ధమైన తర్వాతనే అపాయిటెండ్ డేను నిర్ణయించునున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పారు. జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల విషయంలో అపాయింటెడ్ మూడు నెలల తర్వాత వచ్చిందని కూడా ఆయన చెప్పారు.
లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అపాయింటెడ్ డే మూడు నెలల తర్వాత వస్తే లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు జరగపోవచ్చునని అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తోంది. దీంతో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికల తేదీని వాయిదా వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దానివల్ల లోకసభ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అపాయింటెడ్ డే చాలా కీలకమైంది. దీనిపై బుధవారం స్పష్టత రావచ్చునని అంటున్నారు. 84 వేల మందికి పైగా ఉద్యోగులున్న దశలో క్యాడర్ పంపిణీ అత్యంత క్లిష్టమైన కసరత్తు అవుతోంది. అదే విధంగా అస్తులు, అప్పుల పంపణీ కూడా అంత సులభమైంది కాదు.












Click it and Unblock the Notifications