సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు బిగ్ చెక్- వారసుడు ఆయనే
కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత పోరు మొదలైనట్టే కనిపిస్తోంది. దీనికి తెర తీసింది మరెవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్‌కు బిగ్ చెక్ పడే స్టేట్ మెంట్ ఇచ్చారు యతీంద్ర. సిద్ధరామయ్య తర్వాత ఆయన వారసుడి పేరును వెల్లడించారు.
సిద్ధరామయ్య వారసుడిగా ప్రజా పనుల వ్యవహారాల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ఎన్నికవుతారని యతీంద్ర వెల్లడించారు. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య తర్వాత ఆ స్థాయిలో నాయకత్వ లక్షణాలు ఉన్నది ఒక్క సతీష్ జార్కిహోళికి మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జార్కిహోళికి పార్టీ నాయకత్వ పగ్గాలను అందించడానికి మొగ్గు చూపుతుందని పేర్కొన్నారు.

బెళగావి జిల్లా రాయబాగ్ తాలూకా కప్పలగుద్దిలో శ్రీకనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమంలో యతీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. సతీష్ జార్కిహోళిని సిద్ధరామయ్య తదుపరి వారసుడి పేరును కూడా బహిరంగంగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
"నాన్న (సిద్ధరామయ్య) గారి రాజకీయ జీవితం చివరి దశలో ఉంది. ఈ సమయంలో మాకు సరైన మార్గనిర్దేశం చేసేవారు కావాలి. నాన్నగారిలాగా ప్రగతిశీల ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగిన నాయకులు మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల లక్షణాలు సతీష్ జార్కిహోళిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి సతీష్ జార్కిహోళి సరైన వ్యక్తి. భవిష్యత్తులో పెద్ద బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉండండి.." అని యతీంద్ర అన్నారు.
ఈ వ్యాఖ్యలు- కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. సిద్ధరామయ్య తనయుడే ఈ వ్యాఖ్యలు చేయడం.. దీనికి కేంద్ర బిందువు అయింది. సిద్ధరామయ్య ముందుగానే తన కుమారుడు ఈ హింట్ ఇచ్చారా? రాష్ట్ర కాంగ్రెస్ తదుపరి నాయకుడు డీకే శివకుమార్ కు బదులుగా సతీష్ జార్కిహోళి అవుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవి తనదేనని భావిస్తున్న డీకే శివకుమార్ దీనిపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications