రైతు రుణమాఫీని ప్రకటించిన సీఎం విజయ్: వీరికి సంపూర్ణ వర్తింపు
తమిళనాడు రైతాంగానికి ముఖ్యమంత్రి విజయ్ తీపి కబురు వినిపించారు. రైతు రుణాల మాఫీ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా మొత్తం రూ. 6,220 కోట్ల విలువైన పంట రుణాలను రద్దు చేస్తోన్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతులపై ఉన్న భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.
రైతు రుణమాఫీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ రుణ మాఫీ పథకం కింద ఉన్న నిబంధనలు, పరిమితుల గురించి వివరించారు. రూ. 75,000 లోపు ఉన్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసినట్లు తెలిపారు. ఈ పరిమితిలోపు అప్పులు ఉన్న ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా పూర్తి మినహాయింపు లభిస్తుంది. అదే సమయంలో రూ.75,000 నుండి రూ.1,00,000 మధ్య ఉన్న పంట రుణాలకు గరిష్టంగా రూ.75,000 వరకు మాఫీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కొత్త సవరణల వల్ల రూ. 75,000 నుండి రూ.లక్ష లోపు రుణాలు కలిగి ఉన్న దాదాపు 2,38,264 మంది రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రతి లబ్ధిదారుడికి గరిష్టంగా రూ. 75,000 వరకు రుణ ఉపశమనం లభిస్తుంది. దీని ద్వారా వీరంతా గతంలో పొందినమాఫీ మొత్తం కంటే అదనంగా మరో రూ. 40,000 వరకు ప్రయోజనం పొందేందుకు వీలు కల్పించింది. ఈ అదనపు పంట రుణాల రద్దు వల్ల తమిళనాడు ఖజానాపై సుమారు రూ. 953.06 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
రూ.1,00,000 కంటే ఎక్కువ పంట రుణాలు కలిగిన రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. లక్ష రూపాయల పరిమితి దాటిన రైతులకు గరిష్టంగా రూ. 35,000 వరకు రుణ మాఫీ సదుపాయాన్ని వర్తింపజేస్తామని విజయ్ ప్రకటించారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాము అడుగులు వేస్తోన్నట్లు చెప్పారు. ఈ సాహసోపేత నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 లక్షల మందికి పైగా వ్యవసాయ కుటుంబాలలో కొత్త వెలుగులు నిండుతాయని వ్యాఖ్యానించారు.
గ్రామీణ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే ఈ ప్రధాన పథకం తమిళనాడు సాగు రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విజయ్ పేర్కొన్నారు. అప్పుల బాధల నుండి రైతులకు విముక్తి కల్పించే ఈ రుణాల సదుపాయం సాగు విస్తీర్ణం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం అని, వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని విజయ్ పునరుద్ఘాటించారు.













Click it and Unblock the Notifications