ఉప ఎన్నికల్లో పట్టం కట్టిన ఆ స్థానాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించిన విజయ్
తమిళనాడులోని మధురాంతగం, ధారాపురం నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి విజయ్ భారీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించారు. మొన్నటి ఉప ఎన్నికల్లో టీవీకేకు పట్టం కట్టిన నియోజకవర్గాలు ఈ రెండూ కూడా. అక్కడ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నడుం కట్టారు. తాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తామని ఉప ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు.. విజయ్. దాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా ఎన్నికల కోడ్ ముగియగానే ప్రత్యేక నిధులను ప్రకటించారు. నియోజకవర్గాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన తాగునీరు, రవాణా సౌకర్యాలను అందించడమే కాకుండా, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం.

ధారాపురంలో కావేరి మంచినీటి పథకం, ఉచిత స్థలాల పంపిణీ
ధారాపురం నియోజకవర్గంలో కావేరి నదిని ఆధారంగా చేసుకుని రూ. 1,439 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఉమ్మడి మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా తిరుప్పూర్ జిల్లాలోని దాదాపు 1,232 గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటి సరఫరా లభిస్తుంది. స్థానికంగా ఇళ్లు లేని పేద కుటుంబాలకు 2,700 ఉచిత గృహ స్థల పట్టాలను మంజూరు చేయడం, మూలనూరులో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు, 13,000 నూతన తాగునీటి కనెక్షన్లను అందించనున్నారు.
సాగునీటి కాలువల్లో దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో 271 కిలోమీటర్ల మేర పూడికతీత పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ధారాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ. 6 కోట్లతో నీటి నిల్వ ట్యాంకులు, రూ. 40 లక్షలతో వీధిదీపాలు, రూ. 6 కోట్లతో ఘనవ్యర్థాల నిర్వహణ, వరద నీటి కాలువల అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేయనున్నారు.
మధురాంతకంలో మహిళా కళాశాల
మధురాంతగం నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం అచ్చరపాక్కంలో రూ. 20 కోట్లతో నూతన ప్రభుత్వ మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను నెలకొల్పనున్నారు. అత్తిమానంలో చెక్ డ్యామ్ నిర్మాణం, అట్టూరులో రూ. 20 కోట్లతో 20,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న ధాన్యం గిడ్డంగులు, రూ. 10 కోట్లతో 25 ఎకరాలలో రాష్ట్ర సీడ్ ఫామ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. మధురాంతకం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 10 కోట్లతో అత్యాధునిక ఐసీయూను ఏర్పాటు చేయనున్నారు.
మధురాంతకం లేక్ వద్ద టూరిజం పార్క్, వర్కింగ్ విమెన్స్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడించే హాస్టల్, యువత కోసం రూ. మూడు కోట్లతో నాలెడ్జ్ సెంటర్, రూ. నాలుగు కోట్లతో వీకెండ్ మార్కెట్, పుక్కాత్తురై హైస్కూల్ అప్ గ్రెడేషన్ పనులను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గ్రామీణ విద్యార్థులు, రైతుల అవసరాల కోసం అదనపు బస్సు సర్వీసులను కూడా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.













Click it and Unblock the Notifications
