చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్
గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ముఖ్యమంత్రి విజయ్ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. సచివాలయం నుంచి వర్చువల్ గా వాటిని లాంచ్ చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటి మొత్తం విలువ దాదాపు 190 కోట్ల రూపాయలు. వీటి వల్ల చెన్నై ఉత్తర ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినట్టయింది.
ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులు నిర్వహించిన పలు పనులను విజయ్ ప్రారంభించారు.వీటితోపాటు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 11.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మరో రెండు నూతన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. రక్షిత మంచినీటి సరఫరా, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

చెన్నై మెట్రోపాలిటన్ పరిధిలో వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులను విస్తరిస్తోన్నామని ఈ సందర్భంగా విజయ్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి నిర్ణీత వ్యవధిలోనే పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల చెన్నై పరిధిలోని అనేక ప్రాంతాల్లో పారిశుధ్యం, నీటి పారుదల, రవాణా సమస్యలకు ఊరట లభించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నైని మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దడానికి మరిన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులను రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నట్లు విజయ్ వెల్లడించారు.
నార్త్ చెన్నై లో పునరుద్ధరించిన కడపాక్కమ్ చెరువును విజయ్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు రూ. 58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టు ద్వారా ఈ చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం, పట్టణ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. సుమారు 135 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ చెరువు ప్రాంగణాన్ని ఎకో పార్కుగా తీర్చిదిద్దారు.
చెన్నైలో పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా, ఇటువంటి సహజ సిద్ధమైన నీటి వనరులను కాపాడుకోవడం అవసరమని విజయ్ పేర్కొన్నారు. దీనివల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, వర్షపు నీటిని నిల్వ చేయవచ్చని అన్నారు. ఈ పార్కులో సందర్శకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. వివిధ రకాల వలస పక్షుల ఆవాసానికి అనుకూలంగా చెరువు మధ్యలో బర్డ్ ఐలాండ్ కు రూపకల్పన చేశారు. వీటితో పాటు బటర్ ఫ్లై పార్కు, టర్ఫ్ ఏరియాను తీర్చిదిద్దారు.













Click it and Unblock the Notifications
