'సముద్రం చూస్తే సీఎం.. మళ్లీ చూస్తే ప్రధాని?': సీఎం విజయ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై కనిమొళి సెటైర్లు!
తమిళనాడు సర్కారు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో చెన్నైలో నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయ ప్రతిపాదనపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం విజయ్ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ కొత్త అసంబ్లీ, సచివాలయ భవన నిర్మాణంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ఆస్థాన జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఇచ్చిన విచిత్రమైన సలహాల మేరకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని.. సముద్రానికి ఎదురుగా ఉండే ఆఫీసులో కూర్చుని ఆయన దేశానికి ప్రధాని కావాలని ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు.
జ్యోతిష్యుడి సలహాలతోనే పాలనా నిర్ణయాలా?
చెన్నైలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. సీఎం విజయ్‌పై విమర్శల వర్షం కురిపించారు. "ఆ జ్యోతిష్యుడు ఆయనకు ఏమని నూరిపోశాడో నాకు తెలియదు కానీ సముద్రం కనిపించేలా కొత్త సచివాలయం కడితే ప్రధాని అయిపోవచ్చని చెప్పినట్లున్నారు. సముద్రం వైపు చూస్తు కూర్చోవడం వల్ల ముందే ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు మళ్లీ సముద్రం వైపు చూస్తే ప్రధాని కావచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన ఆ జ్యోతిష్యుడు రేపు హిమాలయాలను చూపిస్తే.. మన సీఎం గారు ఏకంగా అమెరికా అధ్యక్షుడు కావాలని ఆశపడినా ఆశ్చర్యం లేదు" అని నవ్వుతూ సెటైర్లు వేశారు.

రూ.1200 కోట్ల ప్రాజెక్ట్.. తీవ్ర వ్యతిరేకత
చెన్నై తీర ప్రాంతమై పట్టినాపాక్కంలోని తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన విలువైన భూమిలో రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త సచివాలయాన్న నిర్మించడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టినాపాక్కం, మెరీనా లూప్ రోడ్ పరిసరాల్లోనే 1,500కు పైగా మత్స్యకార కుటుంబాలు తమ పడవలను నిలపడానికి, చేపల వలలను ఆరబెట్టుకోవడానికి ఈ స్థలాన్నే ఉపయోగిస్తున్నాయి. ఒక వేళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును బలవంతంగా ముందుకు తీసుకెళ్తే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని మత్స్యకార సంఘాలు హెచ్చరించాయి.
నాడు 24 గంటల్లోనే రద్దయిన నియామకం!
కాగా వివాదాస్పద జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్.. సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మే 10న విజయ్ బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే వెట్రివేల్‌ను ఓఎస్డీగా నియమించడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. డీఎంకే సహా వీసీకే, సీపీఐ, సీపీఎం వంటి మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో ఆ నియామకాన్ని 24 గంటల్లోనే రద్దు చేయాల్సి వచ్చింది. పదవి ఊడినా, సీఎం విజయ్ ఇప్పటికీ ఆ జ్యోతిష్యుడి సలహాల మేరకే పాలనాపరమైన, నిర్మాణపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
