తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయ్ కు ఝలక్: ఒక చోట లీడ్.. మరో చోట సీన్ రివర్స్
తమిళనాడులో ఈ నెల 6న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ప్రారంభ ఫలితాల్లో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని అధికార టీవీకేకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మధురాంతకంలో ఆ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చుతోండగా.. ధారాపురంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ రెండు చోట్ల కూడా టీవీకే, ఏఐఏడీఎంకే అభ్యర్థులు ఆధిక్యతను సాధించారు. రౌండ్ రౌండ్ కూ వారి మెజారిటీ మరింత పెరుగుతూ వస్తోందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు.
మధురాంతకం, ధారాపురంలల్లో ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ఆరంభమైంది. సరిగ్గా నాలుగు నెలల కిందటే అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్‌కు సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికలు మొదటి పరీక్షగా నిలిచాయి. దీంతో ఈ ఫలితాలపైనే అందరి చూపూ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాలకు ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

మధురాంతకంలో రికార్డు స్థాయిలో 86.26 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 1,84,423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధారాపురం నియోజకవర్గంల పరిధిలో 80.25 శాతం పోలింగ్ నమోదు కాగా, 1,79,214 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ రెండు చోట్ల కూడా త్రిముఖ పోరు నెలకొంది. అధికార టీవీకే నుంచి మరగతం కుమారవేళ్ పోటీ పడగా, డీఎంకే తరపున పరంథామన్, ఏఐఏడీఎంకే నుంచి కనిత సంపత్ బరిలో నిలిచారు. ధారాపురంలో టీవీకే తరపున సత్యభామ, డీఎంకే అభ్యర్థిగా సుగన్య, ఏఐఏడీఎంకే నుంచి భానుమతి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
కౌంటింగ్ ప్రారంభం నుంచీ టీవీకే అభ్యర్థులకు ఎదురులేకుండా పోయింది. మధురాంతకంలో టీవీకే అభ్యర్థి కుమారవేళ్.. తన సమీప ప్రత్యర్థి, డీఎంకే కు చెందిన పరంధామన్ పై 1,351 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది. ఎన్‌టీకే, సీపీఐ వంటి ఇతర పార్టీలు నామమాత్రపు ఓట్లకే పరిమితం అవుతున్నాయి. ప్రారంభ రౌండ్లల్లో టీవీకేకు 5,061 ఓట్లు పోల్ అయ్యాయి. డీఎంకే- 3,710, ఏఐఏడీఎంకే- 2,903, ఎన్టీకే- 39, సీపీఐ- 19 ఓట్లు పడ్డాయి.
ధారాపురంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. రెండో రౌండ్ లో ఏఐఏడీఎంకే లీడ్ లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ ఏఐఏడీఎంకే తరఫున పోటీ చేసిన కే భానుమతి ఆధిక్యతలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, టీవీకేకు చెందిన సత్యభామపై 600 ఓట్ల మెజారిటీనీ సాధించారు. డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఏఐఏడీఎంకే- 5,573, టీవీకే- 4,981, డీఎంకే- 4,016 ఓట్లు పోల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications
