మహారాష్ట్ర సీఎంగా శివసేన అభ్యర్థే ఉంటారు: సంజయ్ రౌత్ షాకింగ్ స్టేట్మెంట్
మహారాష్ట్రలో శివసేన బీజేపీల మధ్య జంఝాటానికి తెరపడటం లేదు. ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన పార్టీ పట్టువీడటం లేదు. సీఎం పదవిపై బీజేపీ స్పష్టత ఇచ్చాకే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్లాలని శివసేన సూచిస్తోంది. అదే సమయంలో బీజేపీ లేకుండా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని సంకేతాలు సైతం శివసేన ఇస్తోంది.

పట్టువీడని శివసేన
మహారాష్ట్రలో బీజేపీ శివసేనల మధ్య వివాదం ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరికి వారు పట్టు వీడకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. పదవులతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పద్దతిలో పంచుకోవాలని శివసేన పట్టుబడుతుండగా ఇందుకు బీజేపీ అంగీకరించడం లేదు. డిప్యూటీ సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది శివసేన.

అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న శివసేన
కమలం పార్టీ మెట్టుదిగకపోవడంతో శివసేన అన్ని అస్త్రాలను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా ఎన్సపీ చీఫ్ శరద్‌పవార్‌ను కలిసింది. ఇక బీజేపీకి పలువురు ఇండిపెండెంట్ల మద్దతు ఉన్నప్పటికీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య మాత్రం లేదు. దీంతో కమలనాథులకు శివసేన పార్టీ పక్కలో బళ్లెంలా మారింది. ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత ఇచ్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాబోదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. అదే సమయంలో బీజేపీ సహకారం లేకుండానే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనే స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపారు.

సీఎం శివసేన పార్టీ నుంచే ఉంటారు
ముఖ్యమంత్రి శివసేన పార్టీ నుంచే ఉంటారన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు మూడింట రెండోవంతు మెజార్టీ శివసేనకు వస్తుందని సంజయ్ రౌత్ చెప్పారు. సొంతంగా మెజార్టీ లేని వారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా ఏమైతే అనుకున్నామో అవి అమలు చేసి తీరాల్సిందే అని బీజేపీకి చురకలు అంటించారు సంజయ్ రౌత్

బీజేపీ ఆఫర్‌పై శివసేన ఘాటు స్పందన
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో పాటు ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లో తాను కూడా ఉన్నట్లు చెప్పిన సంజయ్ రౌత్ ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవి రొటేషనల్ పద్దతిలో జరుగుతుందని బీజేపీ చెప్పినట్లు గుర్తుచేశారు. అంతేకాదు మహారాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రి పదవి శివసేనకే దక్కాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేబినెట్‌లో అధిక సంఖ్యలో శివసేన పార్టీ అభ్యర్థులకు చోటుకల్పిస్తామన్న బీజేపీ వ్యాఖ్యలను సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. తమ అభ్యర్థులు బేరమాడేందుకు వ్యాపారవేత్తలు కాదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications