లోకల్ ట్రైన్‌లో నిల్చునే రైల్వే మంత్రి ప్రయాణం!
ముంబై: భారత రైల్వే అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ముంబైలో కిక్కిరిసిన లోకల్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఆకస్మికంగా లోకల్ ట్రైన్‌లో ఎక్కడంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సురేశ్ ప్రభు మాత్రం రైల్వే సర్వీసుల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్లు దారుణంగా ఉన్నాయని, సర్వీసులు ఇంకా మెరుగుపడాలని ప్రయాణికులు చెప్పారు.

ఓ ప్రయాణికుడు సీట్ ఇవ్వడానికి యత్నించగా సురేశ్ ప్రభు సున్నితంగా తిరస్కరించారు. కాగా, కిక్కిరిసిన రైళ్లో మంత్రి ప్రయాణించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ విధంగా చేయడం వల్ల మంత్రికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. మరో ప్రయాణికుడైతే ఏకంగా మంత్రికి తన ఇంట్లో జరిగే వివాహ వేడుకకు ఆహ్వానం కూడా ఇచ్చారు. వీలైనంత తక్కువ సమయంలోనే రైల్వేలో మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని సురేశ్ ప్రభు హామీ ఇచ్చారు.
ముంబైలో వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ. 40వేల కోట్లు వెచ్చించనున్నట్లు సురేష్ ప్రభు తెలిపారు. రైల్వేను మెరుగు పర్చి, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కాగా, రైల్వే మంత్రి స్వయంగా రైలులో ఎక్కి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకోవడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications