4 కోట్ల బోగస్ అకౌంట్లతో లూటీ చేసిన కాంగ్రెస్, 140 కోట్ల మంది నా యజమానులు, మోదీ !
బెంగళూరు/అంకోల/మంగళూరు: తాను ఈ దేశానికి ప్రధాని మాత్రమే కాదని, మీ సేవకుడు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు అందరూ తనకు యజమానులే, మీరు చెప్పిన పని నేను చెయ్యడమే నా కర్తవ్యం, నేను మాటల మనిషికాదు, చేతల మనిషిని అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బుధవారం ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా సమీపంలోని గౌరికెరె మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కన్నడ బాషలో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నేను హిందీలోనే మాట్లాడాలా, లేక మీకు కన్నడలో అనువాదం చెయ్యడానికి ఎవరినైనా స్టేజ్ మీదకు పిలిపించాలా అని ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలను అడిగారు.

మంగళవారం విజయనగరలో ఓ అనువాదకుడు మోదీకి మైక్ ఇవ్వకుండా కొన్ని నిమిషాల పాటు కన్నడ అనువాదంలో దంచికొట్టడంతో ఆ దెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడిపోయినట్లు ఉన్నారు. ఆ సందర్బంలో లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు మీరు హిందీలోనే మాట్లాడాలని మోదీకి మనవి చేశారు.
హిందీ బాషలో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న సమయంలో ఒక లక్ష నకిలి ఖాతాలు ప్రారంభించి గ్యాస్ సబ్సిడీ డబ్బులు లూటీ చేశారని, 30 లక్షల నకిలి ఖాతాలు ప్రారంభించి విద్యా, శిక్షణకు చెందిన సబ్సిడీలు లూటీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
ఒక కోటి మంది విధవల పించన్లకు నకిలి ఖాతాలు ప్రారంభించి ఆ డబ్బులు లూటీ చేశారని, ఇలా మొత్తం నాలుగు కోట్ల నకిలి ఖాతాలు ప్రారంభించి ప్రజలకు రావలసిన సోమ్మును కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారని, ఈ లూటీ చేసిన డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి అదే పార్టీకి చెందిన బడా నాయకులు పంచుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4 కోట్ల ఖాతాలు రద్దు చేస్తామని మోదీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటకను లూటీ చేశారని, సంకీర్ణ ప్రభుత్వంతో ప్రజలకే ఎక్కువ నష్టం వస్తుందని, అందుకే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవి చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో విదేశీయులు రూ. 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టారని, తరువాత బీజేపీ అధికారంలోకి రావడంతో ఇదే కర్ణాటకలో 90, 000 కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని, కర్ణాటకను నెంబర్ వన్ చెయ్యాలంటే మీరు వేసే ప్రతి ఓటు ఎంతో విలువైదని, ప్రపంచంలో కర్ణాటక నెంబర్ వన్ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవి చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ బోగస్ మ్యాటర్ బయటపెడుతామని బీజేపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications