ఈ రెండు రాష్ట్రాల్లో ఓవర్ హాలింగ్: నూతన పీసీసీ అధ్యక్షుల నియామకం
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఉత్తరప్రదేశ్, పంజాబ్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడానికి ఈ మార్పులు చేసింది.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త సారథిగా సీనియర్ శాసనసభ్యురాలు ఆరాధన మిశ్రా మోనా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న అజయ్ రాయ్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఆరాధన మిశ్రా.. సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ కుమార్తె. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తోన్నారు. రాష్ట్రంలో పార్టీ గమనాన్ని మార్చే అత్యంత కీలక బాధ్యతలను అధిష్ఠానం ఆమెకు అప్పగించింది.

ఆరాధన మిశ్రాతో పాటు యూపీలో మరికొన్ని నియామకాలు జరిగాయి. లోక్‌సభ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను యూపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. దేవ్‌ందర్ నిషాద్, ఆలోక్ ప్రసాద్‌ను సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరాధన మిశ్రా యూపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చౌదరి వీరేంద్ర సింగ్‌ను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అధిష్ఠానం నియమించింది.
ఇక పంజాబ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఊహించని మార్పు చేపట్టింది. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌ను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియమించింది. 2022 నుంచి పంజాబ్ కాంగ్రెస్ సారథిగా కొనసాగుతున్న అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్థానంలో పర్గత్ సింగ్ పగ్గాలు చేపట్టనున్నారు. పంజాబ్ రాజకీయాలలో పట్టు సాధించడానికి క్రీడా స్ఫూర్తితో ప్రజాదరణ పొందిన పర్గత్ సింగ్ నాయకత్వం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ నియామకం జరిగిన వెనువెంటనే రాజా వారింగ్ తన పదవికి రాజీనామా చేశారు. పర్గత్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నేళ్లుగా పీపీసీసీ అధ్యక్షుడిగా రాజా వారింగ్ అందించిన సేవలను పార్టీ అధికారికంగా అభినందించింది. పంజాబ్ కమిటీలో మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ ఎన్నికల కమిటీల చైర్మన్లు తమ పాత బాధ్యతల్లోనే యథావిధిగా కొనసాగుతారని కాంగ్రెస్ వివరించింది. ఈ తాజా పునర్వ్యవస్థీకరణతో అటు ఉత్తరప్రదేశ్, ఇటు పంజాబ్ రెండు కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సమరోత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతోంది.












Click it and Unblock the Notifications
