రాహుల్ గాంధీకి పగ్గాలు, మెంటర్‌గా సోనియా: సంక్షోభం తప్పదా?
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం గట్టనుంది. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు పరోక్షంగా ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు పార్టీ నేతలను సంప్రదించి మద్దతు పొందారని, ఏప్రిల్ తొలివారం జరిగే ఏఐసీసీ భేటీలో కీలక నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా 1998 నుంచి సారథ్యం వహిస్తుండటం తెలిసిందే. అధినేత్రిగా ఆమె పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది.

ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్‌కు 2013 జనవరిలో జైపూర్‌లో జరిగిన సమావేశంలో ఉపాధ్యక్ష పగ్గాలు అప్పగించారు. సోనియా పదవీకాలం ముగియనుండగా రాహుల్‌కు పదోన్నతి వార్తలు రావడం గమనార్హం.
రాహుల్‌కు అధ్యక్ష పదవి అప్పగిస్తే మూకుమ్మటిగా సోనియా కోటరీ మొత్తానికి ఉద్వాసన పలికే అవకాశాలు కొట్టిపారేయలేమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తద్వారా పార్టీలో సంక్షోభం తప్పదేమో అనే ఆందోళనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. సోనియా కోటరీ, సీనియర్ల పైన రాహుల్ అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. సోనియా పార్టీకి మెంటర్‌గా ఉండవచ్చునంటున్నారు.
సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు సెలవులో వెళ్లిన రాహుల్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారనే కథనం ప్రచారంలోకి వచ్చింది.
ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు.. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల సన్నిహితుడు జగదీష్ కుమార్ శర్మ ఈ మేరకు ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాఖండ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలను జగదీష్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఏటా ఒకసారి ఉత్తరాఖండ్‌లో ఆయన పర్యటిస్తారని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. రాహుల్ విదేశాలకు వెళ్లారని, మార్చి 10 నాటికి తిరిగివస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా మంగళవారం తెలిపిన నేపథ్యంలో జగదీశ్ స్పందించారు. రాహుల్ గాంధీ బ్యాంకాక్‌లో ఉన్నారనే వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే ఆయన ఫొటోలను ట్వీట్ చేసినట్టు వివరించారు.
అయితే జగదీష్ ట్వీట్లను రాహుల్ కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. ట్విటర్‌లో రాహుల్ క్యాంపింగ్ ఫొటోలు 2008నాటివని పేర్కొంది. అయితే.. పార్టీలో తాను ఆశించిన విధంగా యువరక్తాన్ని ఎక్కించలేకపోవడం పార్టీ పరాజయాలకు తనను బాధ్యుణ్ని చేయడంతో హతాశుడైనందునే రాహుల్ సెలవులో వెళ్లినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications