కాంగ్రెస్ అంటేనే అవినీతి, కులతత్వం, మతత్వం..: మోడీ విమర్శలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ పార్టీ, హుడా కుటుంబంపై మోడీ విమర్శలు గుప్పించారు. హర్యానా ప్రజలను కాంగ్రెస్ కుటుంబ పార్టీ, హుడా కుటుంబం అవమానించాయని మండిపడ్డారు.
అవినీతి, కులతత్వం, మతత్వం, బంధుప్రీతికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులుగా తాను హర్యానాలో పర్యటిస్తున్నానని, ప్రజలు మూడోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించబోమని మోడీ వ్యాఖ్యానించారు.

2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. హర్యానా ప్రజల్ని సుసంపన్నం చేయడానికి కృషి చేసిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని మోడీ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. తండ్రీకొడుకుల రాజకీయ ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమేనని అన్నారు.
హిమాచల్, కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదన్నారు ప్రధాని మోడీ. హార్యానాకు కాంగ్రెస్ ఎప్పటికీ సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని, ఆ పార్టీ అంతర్గత పోరును ప్రస్తావించారు. రిజర్వేషన్లను అంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎప్పటికీ భారతదేశాన్ని బలోపేతం చేయదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉందని, ప్రపంచం చాలా ఆశలు, అంచనాలతో భారత్ వైపు చూస్తోందన్నారు. హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారన్నారు. హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
హర్యానాలో బీజేపీ తన 10 సంవత్సరాల ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా పనిచేసిందన్నారు ప్రధాని మోడీ. రైతులు, యువత, మహిళలు, గ్రామాలు లేదా నగరాలు అనే తేడా లేకుండా సమాజంలోని ప్రతి వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications