విమర్శలపై స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చిన వీవీఎస్ లక్ష్మణ్
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొలంబో విమానం ఎక్కక ముందూ, ఆ తర్వాతా గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు దూరం అయ్యాడు. ఎడమ మోకాలి గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవట్లేదు. ప్రాక్టీస్ సెషన్ లో వేలి గాయం వల్ల కేప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా వామప్ మ్యాచ్ లో ఆడట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు ఇదివరకే గాయాలబారిన పడి ఇంకా కోలుకోవట్లేదు.
ఈ పరిణామాల మధ్య మరో డాషింగ్ ఓపెనర్ జట్టుకు దూరం అయ్యాడు. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. అతనే.. సాయి సుదర్శన్. ఈ నెల 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. గాయం కారణంగా సాయి సుదర్శన్ మొదటి టెస్ట్ లో ఆడట్లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారికంగా వెల్లడించింది.

ఇంతమంది గాయాలబారిన పడటం చర్చనీయాంశమౌతోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా, సాయి సుదర్శన్ మొదట శ్రీలంక జట్టుకు ఎంపిక కావడాన్నీ తప్పుపడుతున్నారు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎలా సిఫార్సు చేస్తారంటూ కొందరు విమర్శకులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై మండిపడుతున్నారు.
దీనిపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు ఎవరినో ఒకరిని బలిపశువును చేయడమో, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల రిహాబిలిటేషన్ అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ బద్ధంగా ఉంటుందని, ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే సాగుతుందని వివరించారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, టీమ్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ సిబ్బందితో పాటు సెలక్షన్ కమిటీ అత్యంత సమర్థవంతంగా పని చేస్తోన్నాయని లక్ష్మణ్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రిహాబిలిటేషన్ పీరియడ్ లో తనకు ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను విజయవంతంగా అధిగమించడానికి ఆయా విభాగాలన్నీకూడా సమన్వయంగా పని చేయాల్సి ఉంటుందని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయని పేర్కొన్నారు.
ప్లేయర్ల ఎంపిక సమయంలో అనుసరించే ప్రొటోకాల్ గురించి లక్ష్మణ్ వివరించారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ తమకు సమాచారాన్ని పంపినప్పుడు.. ఆ ఆటగాడి శారీరక దృఢత్వాన్ని నిశితంగా పరిశీలిస్తామని, దాని తర్వాతే సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ నివేదికను సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్, బీసీసీఐ అగ్రనాయకత్వానికి అందజేస్తామని, ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావు ఉండదని స్పష్టం చేశారు.
శ్రీలంకలో పర్యటించే జట్టుకు మొదట్లో బుమ్రా, సాయి సుదర్శన్ ఎంపికపై వస్తున్న విమర్శలకు లక్ష్మణ్ వివరణ ఇచ్చారు. బీసీసీఐ అధికారిక ప్రకటనలో వారిద్దరి పేర్ల పక్కన స్టార్ గుర్తును ఉంచి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వారిద్దరూ సబ్జెక్ట్ టు ఫిట్‌నెస్ ఆధారంగా మాత్రమే ఎంపిక అయ్యారని, పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తేనే శ్రీలంకకు బయలుదేరి వెళ్తారని ముందే తెలియజేశామని లక్ష్మణ్ వివరించారు.





Click it and Unblock the Notifications