భారత్ దెబ్బ.. 16 నెలలు దాటినా పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదు..!!
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు రెచ్చిపోయి అక్కడ ఉన్న టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన వెనకాల ఉన్నది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ బేస్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్ అలాగే సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిడ్కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి. అలాగే పాకిస్థాన్ లోని పలు ఎయిర్ బేస్ లను భారత సైన్యం ధ్వంసం చేసింది. అలా భారత్ సైన్యం ధ్వంసం చేసిన వాటిలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సర్గోధా ఎయిర్ బేస్ ఒకటి.
సర్గోధా ఎయిర్ బేస్ వద్ద ఇంకా రిపేర్ పనులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఇప్పటికి దాదాపు 16 నెలలు కావొస్తున్నా ఆ దాడి నుంచి పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదని స్పష్టం అవుతోంది. ఇక సర్గోధా ఎయిర్ బేస్ లాహోర్ కు నార్త్ వెస్ట్ లో 172 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే పాకిస్థాన్- భారత్ బోర్డర్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సెప్టెంబర్ 12న వాంటోర్ శాటిలైట్ తీసిన ఫొటో చూస్తే సర్గోధా ఎయిర్ బేస్ పై ఇంకా మరమ్మతు పనులు ఎక్కడివక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

మే 10, 2025 లో తీసిన శాటిలైట్ చిత్రంలో ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసం అయినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఆగస్టు 28, 2026 లో తీసిన ఫొటోలో రిపేర్ వర్క్ ముగిసి పాచ్ వర్క్ పూర్తయినట్లు చిత్రంలో ఉంది. కానీ తాజాగా సెప్టెంబర్ 12 న తీసిన ఫొటోలో మాత్రం ఆ ఎయిర్ బేస్ వద్ద ఇంకా పనులు పూర్తి కానట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పడినా భారీ గుంతను గతంలోనే పూడ్చినా అది పూర్తిగా మెరగవలేదు. దీంతో మరోసారి అక్కడ రిపేర్లు చేస్తుండటం శాటిలైట్ ఇమేజెస్ లో స్పష్టంగా కనిపించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి సుఖోయ్ ఫైటర్ జెట్ ద్వారా బ్రహ్మోస్ మిస్సైల్ తో అక్కడ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ దెబ్బ పాకిస్థాన్ అబ్బా.. అంటూ నెటిజన్లు ఈ ఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
