karnataka assembly polls : కర్నాటక కాంగ్రెస్ తొలి జాబితా విడుదల-డీకే, సిద్ధూ సహా హేమాహేమీలు..
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 224 సీట్లున్న కర్నాటక అసెంబ్లీలో తొలి జాబితాలో 124 సీట్లకు అభ్యర్ధుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ సహా పలువురికి చోటు దక్కింది.
కర్నాటక కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసిన తొలి జాబితాలో పీసీసీ ఛీఫ్ డీకే శివకుమార్ కు మళ్లీ కనకపుర సీటు కేటాయించారు.అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్యకు ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మైసూరు సీటు ఇచ్చారు.కానీ ఆయన కోలార్ నుంచి పోటీచేసేందుకు సిద్ధరామయ్య కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతనెలలో పార్టీకి తాను పోటీ చేసేందుకు ఇచ్చిన మూడు నియోజకవర్గాల ఆప్షన్స్ లో బాదామి, వరుణతో పాటు కోలార్ కూడా ఉంది. కానీ పార్టీ ఆయనకు అనూహ్యంగా మైసూరు నుంచే పోటీ చేయాలని సూచించింది. అటు కోలార్ లో ఆయన గెలిచే అవకాశం లేదని పార్టీ భావిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, అగ్రనేతలు కూడా ఉన్నారు. 91 ఏళ్ల శామనూరు శివశంకరప్ప దావణగెరె సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. కోలార్‌కు చెందిన కీలక నేత, ఎంపీ కేహెచ్ మునియప్పకు దేవనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. వీరితో పాటు పలువురు సిట్టింగ్ లకు కూడా ఈ జాబితాలో సీట్లు దక్కాయి. త్వరలో రెండో జాబితా కూడా విడుదల చేసి ఎన్నికలకు ముందే రంగం సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది.












Click it and Unblock the Notifications