ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ముగిసింది : ప్రధాని మోదీ
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తన స్థానాన్ని కూడా కోల్పోతారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ తన సొంత పార్టీ సీనియర్ నేతలనే పట్టించుకోలేదని, అలాంటిది ప్రజలను వారికిచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేరుస్తుందని ప్రధాని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పాలన ముగిసిందని ఆ పార్టీ అధీష్టానానికి కూడా అర్థమైందని అన్నారు. ఢిల్లీకి చెందిన కొంతమంది జర్నలిస్టు మిత్రులు, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత ముఖ్యమంత్రి (బాఘెల్) తన సొంత స్థానమైన పటాన్ నియోజకవర్గంలోనే ఓటమి చవిచూస్తారని తనకు చెప్పినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ దౌర్భాగ్య పాలనకు చత్తీస్‌ఘఢ్ ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రధాని జోస్యం చెప్పారు. ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను దోచుకున్న కాంగ్రెస్ పాలకులను సాగనంపే సమయం ఆసన్నమైందని అన్నారు.
మోడీ కులాన్ని కూడా ద్వేషిస్తున్నారు : కాంగ్రెస్ పార్టీ తనను ఎంతగా ద్వేషిస్తోందంటే.. మొత్తం రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ను తన మీద ద్వేషంతో అవమానిస్తున్నారని ప్రధాని అన్నారు. "కాంగ్రెస్ మోడీని ద్వేషిస్తుంది. అంతేకాదు, వారు మోడీ కులాన్ని కూడా ద్వేషించడం ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా, మోడీ పేరుతో మొత్తం ఓబిసి సమాజాన్ని కాంగ్రెస్ అవమానపరుస్తోంది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఆ పార్టీ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించిందని గుర్తుచేశారు.

రాష్ట్రంలోని బాఘెల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ సామాజికవర్గంపై ఎంత ద్వేషం ఉందో ఇదో ఉదాహరణ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్సేనని, బాబాసాహెబ్ రాజకీయాలను అంతం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ప్రధాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఓటు బ్యాంకు, బుజ్జగింపుల కోసం కాంగ్రెస్ ఏమైనా చేయగలదని అన్నారు.
మొత్తం ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి. 20 స్థానాలకు మొదటి దశ పోలింగ్ గత వారం ముగిసింది. రాష్ట్రంలోని మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎన్నికల నియమావళి అమల్లో ఉంది.












Click it and Unblock the Notifications