యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల పంపకాలపై తేల్చని అఖిలేష్: తాహతుకు మించి?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతతోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం కావడం, బీజేపీకి గట్టి పట్టు ఉండటం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టీ నెలకొనడం సహజమే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. దీంతో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
ఈ నేపథ్యంలో.. కొంతకాలంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఊహాగానాలు వ్యక్తమౌతోన్నాయి. దీనిపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 181 స్థానాలు అడిగిందని వెల్లడించారు. అడిగినన్ని సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తారా లేదా అనేది ఆయన వెల్లడించలేదు. తమకు కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉన్నాయని, సీట్ల పంపకాల విషయంలో విభేదాలకు రాబోవని ఆశిస్తోన్నట్లు చెప్పారు.

ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ లో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ కు 100 సీట్లు కేటాయిస్తారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 100 కంటే చాలా ఎక్కువగా సీట్లు అడుగుతోందని, దీని నంబర్ 181 వద్ద ఉందని నవ్వుతూ చెప్పారు. కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇవ్వాలా వద్దా అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయించుకునే విషయం కాదని, దీనిపై కూలంకషంగా చర్చించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలపై అఖిలేశ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. గతంలో బీఎస్‌పీతో కలిసి పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాము కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్ లో భాగస్వామిగా ఉన్నామని, దీనికే పూర్తిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వేరే పార్టీలతో చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని, బీఎస్‌పీ సుప్రీమో మాయావతితో ఎలాంటి సంప్రదింపులూ జరపట్లేదనీ ఆయన వివరించారు.
తమ కూటమి ప్రధాన ధ్యేయం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమేనని అఖిలేశ్ పునరుద్ఘాటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఉదాహరించారు. యూపీలో భాజపా సీట్లు తగ్గడం వల్లే కేంద్రంలో ఆ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిందని గుర్తుచేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలతో కూడిన పీడీఏ సామాజిక సమీకరణం తమకు బలమైన పునాది అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విధానాల వల్ల నష్టపోయిన ప్రజలంతా తమ కూటమి వైపే నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి ఉత్తరప్రదేశ్‌లో అధికార భాజపాను ఢీకొట్టడానికి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నాయి. సీట్ల సంఖ్యపై బహిరంగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, రెండు పార్టీల అగ్రనాయకత్వాల మధ్య ఉన్న సానుకూల వాతావరణం పొత్తును ముందుకు నడిపిస్తుందని ఎస్పీ నమ్ముతోంది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం అధికారికంగా ఏ రూపు దాలుస్తుందనేది యూపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.















Click it and Unblock the Notifications
