
జమ్మూకాశ్మీర్ లో వివాదాస్పద ఎన్‌కౌంటర్ రగడ; మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన జమ్మూ సర్కార్
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైదర్ పోరా ప్రాంతంలో భద్రతాదళాలు సోమవారం చేసిన ఎన్‌కౌంటర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వ్యాపారి మహమ్మద్ అల్తాఫ్ బట్, వైద్యుడు ముదాసిర్ గుల్ అమాయకులని వారి కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో ఇద్దరు స్థానికులను చంపిన వివాదాస్పద ఆపరేషన్‌పై తీవ్ర ఆగ్రహం మధ్య, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నవంబర్ 18 న మెజిస్టీరియల్ దర్యాప్తుకు ఆదేశించింది.మృతుల కుటుంబాలు వారు భద్రత దళాల చేతిలో చంపబడ్డారని ఆరోపించగా, భద్రతా దళాలు వారు "ఉగ్రవాద సహచరులు" అని చెప్తున్నారు.
జమ్మూ
కాశ్మీర్
మెడికల్
కాలేజ్
ఆస్పత్రిపై
ఉగ్ర
దాడి
..
తప్పించుకున్న
ఉగ్రవాదుల
కోసం
సెర్చ్
ఆపరేషన్
సోమవారం పోలీసు ఆపరేషన్ తర్వాత వచ్చిన ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ఎన్‌కౌంటర్ పై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. ప్రభుత్వం కుటుంబాల డిమాండ్‌లను పరిశీలిస్తుందని, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పోలీసు విచారణలో తప్పు ఏమి జరిగిందో కూడా తెలుస్తుంది అని జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌లో ఏమి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తాము ప్రజల భద్రత కోసం పని చేస్తున్నామని జమ్ము కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్ బాగ్ సింగ్ పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం కూడా ఈ ఘటనపై "అన్యాయం జరగకుండా చూస్తాం" అని ట్వీట్ చేసింది. హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌లో ఏడీఎం ర్యాంక్ అధికారితో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సమయానుకూలంగా నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. అమాయక పౌరుల ప్రాణాలను రక్షించడానికి జమ్మూ కాశ్మీర్ పరిపాలన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని, ఎలాంటి అన్యాయం జరగదు అని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Recommended Video
హైదర్‌పోరాలోని భవన సముదాయంపై ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో వ్యాపారవేత్త అల్తాఫ్ భట్ మరియు డెంటల్ సర్జన్ ముదాసిర్ గుల్ మరణించారు. తొలుత ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు ప్రకటించిన పోలీసులు, ఆ తర్వాత ఎదురుకాల్పుల్లో మరణించి ఉండవచ్చని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు "ఉగ్రవాద సహచరులు" అని పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల సమయంలో పోలీసులు వీరిని రక్షణ కవచంగా వాడుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే భద్రతా దళాలు మాత్రం మరణించిన వారు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఇక దీనిపై విచారణ జరపాలంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు . ఎన్ కౌంటర్ తర్వాత పరిణామాల నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ ఎన్ కౌంటర్ పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.